అన్నదమ్ముల మధ్య ఘర్షణ
గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్–67) జాతీయ రహదారి పక్కనే సత్యాటౌన్‌షిప్‌లో ఆదివారం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మూడే పెద్దతిరుమలయ్య, గురమ్మలకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీరిలో చిన్న కుమారుడు మూడే చిన్నగురయ్య (41) సీడ్ వ్యాపారంలో పని చేస్తున్నాడు. చిన్నగురయ్య అతని మూడవ అన్న గురయ్యకు డబ్బులు ఇవ్వడం జరిగింది. గురయ్య పోరుమామిళ్లలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో బద్వేలులో నివాసముంటున్న చిన్న తమ్ముడు చిన్నగురయ్యను డబ్బులు విషయం మాట్లాడదామని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు పిలవడం జరిగింది. అందరూ కలిసి సత్యాటౌన్‌షిప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చిన్నగురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తన అన్న పెద్దగురయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈయన కలసపాడులో నివాసముంటూ కడప వాటర్‌షెడ్‌లో పని చేస్తున్నాడు. ఘర్షణలో చిన్నగురయ్య మృతి చెందడం, పెద్దగురయ్య తీవ్ర గాయాలతో కిందపడటంతో మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పరారైనట్లు తెలిసింది. పరారైన అన్నదమ్ముల్లో ఒకరు బెంగళూరులో పీజీ నడుపుతున్నారు. మరొకరు టీచర్‌గా పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బద్వేలు అర్బన్, రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ పెద్దగురయ్యను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన చిన్నగురయ్యను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అన్నదమ్ముల మధ్యే జరిగిన ఘర్షణలోనే చిన్నగురయ్య మృతి చెందాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
గాయపడిన పెద్దగురయ్య
మృతి చెందిన చిన్నగురయ్య
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
అన్నదమ్ముల మధ్య ఘర్షణ


