ఘర్షణలో వ్యక్తి మృతి
కేవీపల్లె : నీటి పైప్‌లైన్ విషయమై ఇరువురు ఘర్షణ పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జమకులవడ్డిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమకుల వడ్డిపల్లెకు చెందిన పసుపులేటి రెడ్డప్ప (50) అదే గ్రామానికి చెందిన పి.రమణ మధ్య ఆదివారం రాత్రి నీటి కుళాయి పైపులైను విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. మాటకుమాట పెరిగి తోపులాటకు దారితీయగా, ఆ సమయంలో రెడ్డప్ప కింద పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
22న వేలం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో టెంకాయల విక్రయ దుకాణం లైసెన్స్ కోసం ఈ నెల 22న వేలంపాట జరగనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెండర్ ప్రారంభంలో ఒక సంవత్సర కాలానికి అనుమతులు ఇవ్వగా, ఏడాది గడువు ముగిసిన తరువాత వాయిదా చెల్లింపుల్లో టీటీడీ వారు సంతృప్తి చెందితే, మరో రెండు సంవత్సరాలు పొగించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. 22న మధ్యాహ్నం 2 గంటలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.


