వైఎస్ అభిషేక్ రెడ్డికి నివాళి
పులివెందుల/రూరల్ : ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, వైఎస్సార్‌సీపీ తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు దివంగత వైఎస్ అభిషేక్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు నివాళి అర్పించారు. పులివెందుల పట్టణంలోని స్థానిక అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో పాటు ఆమె సోదరుడు ఈసీ దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత వారు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ అభిషేక్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో చిన్న వయస్సులో రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తక్కువ కాలంలోనే పార్టీ కోసం అనేక సేవలు అందించి గొప్ప వ్యక్తిగా వైఎస్ అభిషేక్‌రెడ్డి నిలిచిపోయారన్నారు. ఆయన మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. సీఎస్‌ఐ చర్చి ఫాదర్ బాబు, మృత్యుంజయరావు, మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరలోకంలో ఉన్న వైఎస్ అభిషేక్‌రెడ్డికి శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు.
ప్రొద్దుటూరు క్రైం: రెండు చోరీ కేసుల్లో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శనివారం రూరల్ పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన కొట్లూరు పర్వతమ్మ ఆటోలో వెళ్తున్న సమయంలో దువ్వూరు రోడ్డు సర్కిల్‌లోకి వెళ్లగానే దొంగలు బంగారు చైన్‌ను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రగుంట్ల రోడ్డులోని నంగనూరుపల్లె క్రాస్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రావడంతో రూరల్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాగమణి అలియాస్ నాగమ్మ, వెంకటరమణరేఖ, రాచనేని అర్జున్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్లను స్వాధీ నం చేసుకున్నారు. ప్రొద్దుటూరులోని పర్వతమ్మ మెడలోని చైన్‌తో పాటు నందలూరు బస్టాండులో వల్లూరు భాగ్యమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు చైన్‌ను దొంగలించినట్లు నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు. రెండు కేసుల్లోని బంగారు చైన్లను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పట్లుబడిన ముగ్గురిపై తమిళనాడు రాష్ట్రంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


