పండుగకు ఊరెళుతున్నారా.. జాగ్రత్త !
● ఇంటి భద్రతపై పోలీస్
సూచనలు పాటించండి
● ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె రూరల్ : సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే వారు తమ ఇంటి భద్రతకు సంబంధించి పోలీస్ సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో చోరీలు జరిగేందుకు అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్యపరిచేందుకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం పండుగ సెలవులకు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లేవారు పాటించాల్సిన కీలకభద్రత సూచనలపై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడాలన్నారు. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దన్నారు. బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకమైన బంధువుల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని, వాటిని మొబైల్ ఫోన్‌కు అనుసంధానించుకుంటే, ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం ఇస్తే, గస్తీని ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రయాణవివరాలను, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలు సులభంగా సమాచారం తెలుసుకునే వీలుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ వెలుగుతో ఉండేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో పోలీస్‌వాహనాల ద్వారా మైకుల సహాయంతో ప్రజలకు రక్షణ సూచనలు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, బీట్‌కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు.


