అక్రమాలపై ఈఓ విచారణ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి జరిగిన అవినీతి అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు కాణిపాకం ఈఓ పెంచల కిషోర్ శనివారం విచారణ చేపట్టారు. బోయకొండ గంగమ్మ ఆలయం వద్దకు చేరుకొని తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. నవంబరు 6న బోయకొండలోఅవినీతి అక్రమాలపై రాష్ట్ర బీసీ కార్పొరేషన్ (పాల ఏకరి) చైర్మన్ , పుంగనూరు నియోజకవర్గపు టీడీపీ అబ్జర్వర్ నాగేశ్వర నాయుడు దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కమీషనర్ విచారణ అధికారిను నియమించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆలయ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడుతోపాటు పలువురు ఫిర్యాదిదారులను పెంచల కిషోర్ సుధీర్ఘంగా విచారణ చేపట్టి వారి వద్ద గల ఆధారాలను సేకరించారు. ఆలయంలో గల హుండీ ఆదాయంలో అక్రమాలు, ఆలయం వద్ద తలకాయలు అఽధిక రేట్లకు విక్రయిస్తున్నా ఈఓ ఏకాంబరం ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా గృహాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని పలువురు విన్నవించారు. విచారణ నివేదికను దేవదాయశాఖ కమిషనర్‌కు త్వరలో అందజేస్తామని పెంచలకిషోర్ వెల్లడించారు.


