తల్లి పొత్తిళ్ల నుంచి.. ప్రార్థనా మందిరం మెట్లపైకి
ఆ తల్లికి తొమ్మిది నెలలు మోసినప్పుడు లేని బరువు...బయటకు వచ్చాక అనిపించిందేమో...కఠిన గుండె పేగు బంధం మరిచిందేమో...ఆడపిల్లని వద్దనుకుందో..లేక తల్లికి తెలియకుండా ఎవరైనా వదిలేశారో తెలియదు కానీ...బొడ్డు పేగు రక్తం మరక ఆరకనే పురిటిబిడ్డ ఎముకలు కొరికే చలిలో ప్రార్థనామందిరం మెట్లపై కనిపించింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సింది పోయి, ఆరుబయట చలి, మంచుకు తట్టుకోలేక ఏడుస్తూ కనిపించింది. ఎవరో చేసిన నేరానికి..భూమిమీద పడగానే పసికందు శిక్ష అనుభవిస్తోంది.
● మదనపల్లె పట్టణంలో అమానుష ఘటన
● ఎముకలు కొరికే చలిలో పురిటిబిడ్డను వదిలివెళ్లిన కసాయి
● ఐసీడీయస్ అధికారులకు అప్పగించిన పోలీసులు
మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణం తిరుపతిరోడ్డు బాలాజీనగర్‌లో ప్రార్థనా మందిరం మెట్లపైన శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ ఆడ పసికందును వదిలేసి వెళ్లారు. చిమ్మ చీకట్లో, ఓ వైపు చలి, మరో వైపు మంచు కురుస్తుండగా, తట్టుకోలేక పసిప్రాణం విలవిలలాడుతూ ఏడుస్తుంటే...ఉదయాన్నే బిడ్డ ఏడుపులు ఏందంటూ స్థానికులు బయటకు వచ్చి చూశారు. చుట్టూ ఎవరూ లేకపోవడం, బొడ్డు పేగు సైతం సరిగ్గా కత్తిరించకుండా, రక్తపుమరకలతో పసికందును గుర్తించారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళ గౌతమి, బిడ్డను చేతుల్లోకి తీసుకుని, ఓదార్చింది. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...తక్షణం స్పందించి శిశువును ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఎన్‌ఐసీయూ విభాగంలో వైద్యులు పురిటిబిడ్డకు చికిత్సలు అందించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీడీయస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ నాగవేణి, సూపర్‌వైజర్ కళావతి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బిడ్డకు టీకాలు వేయించి, ప్రొసీడర్స్ పూర్తిచేసి, చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ అనుమతితో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న బాలసదన్ శిశుగృహకు తరలించి, మేనేజర్ సుప్రియకు అప్పగించారు. ఆడపిల్ల పుట్టిందనే వదిలి వెళ్లారా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో ఐసీడీయస్ సిబ్బందితో స్థానికంగా విచారణ చేస్తున్నట్లు సీడీపీఓ నాగవేణి తెలిపారు.
తల్లి పొత్తిళ్ల నుంచి.. ప్రార్థనా మందిరం మెట్లపైకి


