ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు
● దాడుల్లో పట్టుబడ్డ వీఆర్వో
● కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోనరాజుపల్లి వీఆర్వో శ్రీనివాసులు పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోనరాజుపల్లి గ్రామంలో రైతులు అయినటువంటి చింతకుంట రాజారెడ్డికి సర్వే నెంబర్ 195లో 1.79 ఎకరాలు, చింతకుంట రమణారెడ్డికి సర్వే నెంబర్ 201 లో 2.31 ఎకరాలు భూమి ఉందన్నారు. ఈ భూముల్లో ఇదివరకే ఉన్న బోర్లకు వొల్టా చట్టం కింద ఎన్‌వోసీ ధ్రువీకరణ పత్రాల కోసం 2025 డిసెంబర్ 19వ తేదీన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పరిశీలించి, రిపోర్టు తయారు చేయాలని ఆ గ్రామానికి చెందిన వీఆర్వో శ్రీనివాసులును తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆదేశించారు. అప్పటి నుంచి వీఆర్వో శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్న ఈ ఇద్దరి రైతుల నుంచి రూ. 9వేల చొప్పున మొత్తం రూ. 18వేలు లంచ అడిగినట్లు తెలిపారు. ఈ రూ.18వేలతో పాటు దరఖాస్తు చలానా ఇద్దరి రైతుల నుంచి రూ. 2వేలు చొప్పున మొత్తం రూ. 22వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అయితే అంత ఇచ్చుకోలేని రైతులు రాజారెడ్డి, రమణారెడ్డి వీఆర్వోను తగ్గించమని ప్రాధేయపడగా ఒక్కొక్కరికి రూ. 8వేలు చొప్పున రూ.16 వేలు, దరఖాస్తు చెలానా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ. 20వేలు ఇవ్వాలని లేని పక్షంలో మీ పని చేయలేనని బెదిరంచారన్నారు. వీఆర్వో చెప్పిన రూ. 20 వేల లంచంలో మొదటి విడతగా రూ.15 వేలు శుక్రవారం తీసుకురావాలని వీఆర్వో శ్రీనివాసులు ఆదేశించారన్నారు. అంత లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజారెడ్డి కడప ఏసీబీ కార్యాలయంలోని తనను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం వీఆర్వో శ్రీనివాసులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వెనుక వైపు ఫిర్యాదుదారుడు రాజారెడ్డి వద్ద నుంచి మధ్యాహ్నం 2:39 గంటలకు రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా తాను, తమ సీఐలు శ్రీనివాసరెడ్డి, నాగరాజు, సిబ్బంది దాడులు చేసి, వీఆర్వో శ్రీనివాసులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు విచారణ పూర్తి అయిన తరువాత వీఆర్వో శ్రీనివాసులును కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచి, రిమ్యాండ్ కు పంపనున్నట్లు తెలిపారు.


