నేడు తలనీలాల సేకరణకు వేలం
సిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి భక్తుల తలనీలాల పోగు హక్కు కోసం శనివారం సిద్దవటంలోని రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు నిత్యపూజ స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించు తలనీలాల ప్రోగు హక్కు కోసం వేలంలో పాల్గొనే పాటదారుడు డిపాజిట్ లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలం ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు మిగిలిన డబ్బులు చెల్లించి అధికారుల వద్ద రసీదు పొందాలన్నారు.
గంగమ్మకు రాహుకాల పూజలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10:30 గంటలనుంచి 12 గంటల వరకు సాంప్రదాయరీతిలో అర్చనలు ,అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి మొక్కులు తీర్చారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.


