రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రామసముద్రం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరుకు చెందిన ఇస్మాయిల్ (45) రామసముద్రంలో ఇస్తిమా కు వస్తుండగా దిన్నిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందివ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుక్క అడ్డురావడంతో..
– బైక్‌పై నుంచి పడి ముగ్గురికి గాయాలు
రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం ఫజులుపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత గ్రామ పంచాయతీ మద్దిపట్లవారిపల్లెకు చెందిన మహేంద్రనాయుడు, శేషముని నాయుడు, జస్వంత్ ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు వెళుతుండగా ఫజులుపేట వద్ద కుక్క అడ్డు రావడంతో ఢీకొని కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయ పడ్డారు. స్థానిక ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వెళ్లారు. రోడ్డు మీద కుక్కలు వీపరీతంగా ఉన్నాయని, ద్విచక్ర వాహనాల్లో వెళుతున్నవారిపై ఎగ బడుతున్నాయని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బొలెరో, బైక్ ఢీ:
రియల్టర్ మృతి
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో రియల్టర్ మృతి చెందిన విచారకర సంఘటన కురబలకోట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మదనపల్లి రూరల్ మండలం సీటీఎం సోమలగడ్డకు చెందిన రెడ్డెప్ప (52) పరిసర ప్రాంతాల్లో రియల్టర్‌గా కొ నసాగుతున్నారు. ఇతను భవన నిర్మాణ పనులు చేపట్టాడు. గురువారం సాయంత్రం టైల్స్ కోసం మదనపల్లి దగ్గరున్న అమ్మచెరువు మిట్ట వద్దకు వెళ్లాడు. అనంతరం ద్విచక్రవాహనంలో మదనపల్లె హైవేపై అవతలి రోడ్డుపైకి వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తుండడంతో ఆపాడు. హైవేపై వెనుకగా వచ్చిన బొలెరో వాహనం ఇతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ రవి నాయక్ సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు.
చికిత్సపొందుతూ..
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్కూటరిస్తు మృతి చెందినట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు. వివరాలి లావున్నాయి, పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి. వెంకటేష్ (28) బుధవారం ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొ న్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో గాయప డిన వెంకటేష్‌ను చికిత్సనిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య అన్నపూర్ణ, కుమారులు ధీరజ్, అరుణ్, ధనుష్ ఉన్నారు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు.


