సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం
మదనపల్లె రూరల్ : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఈనెల 12 తర్వాత సమ్మెలోకి వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవఅధ్యక్షులు ఎ.రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణయాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ.చలపతి పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదనరావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..రూ.4వేలు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీఓ.నంబర్ 49 ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి వేతనం అమలుచేయకుండా కేవలం రూ.2వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కట్‌చేసి, యాజమాన్యం వాటా పీఎఫ్ బ్యాంకు ఖాతాకు జమచేయకపోవడం దుర్మార్గపుచర్యగా పేర్కొన్నారు. ఒకో నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనాలు తగ్గించి ఇస్తున్నారన్నారు. కనీసం పే స్లిప్ ఇవ్వనటువంటి భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి మళ్లీ పరీక్ష ఉత్తీర్ణులైతేనే నియామకం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దుచేసి, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి స్లాబ్ అప్‌గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీడీఏ అలవెన్సులు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలుచేయాలన్నారు. పనిచేసే ప్రదేశంలో షెల్టర్, వాహన క్లీనింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ, 8 గంటల పని అమలుచేయాలని కోరారు. వాహన మరమ్మతులు ప్రభుత్వమే చేయించి సిబ్బందికి అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగించాలన్నారు. జిల్లాకు ఒకటి కాకుండా డివిజన్‌కు ఒక గ్యారేజీ ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 108 సిబ్బంది పాల్గొన్నారు.


