రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం ప్రారంభం
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేసి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని రిటైర్డ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద నూతనంగా తయారు చేసిన రాయచోటి జిల్లా చిత్రపటాన్ని అఖిలపక్ష కమిటీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని మార్చే ప్రసక్తే లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు పలు రకాల పెట్టుబడులు రాయచోటి ప్రాంతంలో పెట్టుకున్నారని గుర్తుచేశారు. అయితే జిల్లా కేంద్రం మార్చడంతో వారంతా నష్టపోతున్నారని తెలిపారు. ఈ తప్పును సరిదిద్దుకునేందుకు రాయచోటి చుట్టూ ఉన్న 14 మండలాలను కలుపుకుని ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంఈవో రెడ్డెన్న మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా కొనసాగిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేసి మదనపల్లెను జిల్లా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే రాయచోటి ప్రత్యేక జిల్లా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భారత న్యాయవాదుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఎమ్మార్‌పీఎస్ జాతీయ నాయకుడు, పౌర హక్కుల సంఘం నాయకుడు రెడ్డెయ్య, రవిశంకర్, ఉపాధ్యాయులు హరిబాబు, రామచంద్ర, రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, వడ్డెర సంఘం నాయకులు జీవానందం, చల్లా రెడ్డెయ్య, చంద్రశేఖర్, న్యాయవాదుల సంఘం నాయకులు ఆనంద్ కుమార్, ఐఏఎల్ నాయకులు నాగముని, రవిశంకర్, జగదీష్, కోటేశ్వరరావు, శంకర్ నాయక్, రమణ, చెన్నకృష్ణ, తాతయ్య, ఖాదర్ బాషా, రామచంద్ర, బసిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం ప్రారంభం


