మార్కెట్ కమిటీ డైరెక్టర్‌పై టీడీపీ నాయకుల దాడి
మదనపల్లె రూరల్ : మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీడీపీ నాయకులు మున్నా నాయక్‌పై, అదే పార్టీకి చెందిన నాయకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం పట్టణంలోని జేఎన్‌ఆర్ గ్రాండ్ హోటల్‌లో, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గురుమూర్తి హాజరయ్యారు. సమావేశంలో కోటవారిపల్లె సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంపై ప్రస్తావన వచ్చింది. మార్కెట్‌కమిటీ డైరెక్టర్ మున్నా, తనకు అవకాశం ఇవ్వాలని కోరగా, కొందరు వ్యతిరేకించారు. నిన్న లేక మొన్న నాయకులైన వారికి పదవులు ఇస్తారా అని అడిగితే, 11 నెలల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకున్నాం కదా అని మున్నా నాయక్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సమావేశం ముగిసిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్‌ను, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు షంషీర్, స్నేహితుడైన టీడీపీకి చెందిన రఘునాయక్, లాల్‌బాషాలు నిలదీశారు. ఎమ్మెల్యేపైనే మాట్లాడేంత గొప్ప వ్యక్తి నువ్వా అంటూ నిలదీశారు. నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ ఎదుట మున్నానాయక్‌పై, ఉన్న పళంగా రఘునాయక్, లాల్‌బాషా దాడికి పాల్పడ్డారు. చెంపపై బలంగా కొడుతూ చేయి విరిచే ప్రయత్నం చేశారు. దీంతో మున్నానాయక్ చేయికి గాయమైంది. పార్టీ పరిశీలకుడి ఎదుటే మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ను, సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కొట్టడంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం డిమాండ్ చేశారు. మున్నానాయక్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. దీంతో విషయం పెద్దది అవుతుందని భావించిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా... ఈ విషయంలో జోక్యం చేసుకుని, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ మున్నానాయక్‌ను, దాడిచేసిన రఘునాయక్, లాల్‌బాషాను ఇంటికి పిలిపించి కుటుంబ సమస్యతో వాగ్వాదం జరిగిందని చెప్పించారు.


