హెల్మెట్ భారం కాదు భరోసా
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని భారంగా అనుకోకుండా భరోసాగా భావించి తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా హెల్మెట్ ధరించి, మిషన్ కాంపౌండ్ నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు బైక్ నడిపి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే, సుమారు 70 శాతం మరణాలు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. తలకు తగిలే చిన్న గాయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని, కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని, ఇది అత్యంత విచారకరమన్నారు. హెల్మెట్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, ప్రాణాలను కాపాడే భద్రతా కవచంగా పేర్కొన్నారు. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం వల్ల సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ యం.వెంకటాద్రి, డీఎస్పీ కే.మహేంద్ర, ట్రాఫిక్ సీఐ గురునాథ్, సీఐలు చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, కళా వెంకటరమణ, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
హెల్మెట్ భారం కాదు భరోసా


