వేళకు వస్తున్నారా.. భోజనం పెడుతున్నారా!
మదనపల్లె: వైద్యులు వేళకు వస్తున్నారా.. భోజనం సరిగా పెడుతున్నారా అంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్ రోగులతో ఆరా తీశారు. మంగళవారం కలెక్టర్ స్థానిక జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నివార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్ పేషంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా సాగుతోందని రికార్డులను పరిశీలించారు. దీనిపై సూపరింటెండెంట్ రమేష్ వివరించారు. ఆసుపత్రిలోని ఓపి, ఇన్ పేషెంట్ గదులను, ఐసీయూ వార్డును, తనిఖీ చేసి ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఫార్మసీ ని తనిఖీ చేసి ఏయే ఔషధాలు వస్తున్నాయి ఏ విధంగా నిల్వ చేస్తున్నారు, ఆన్ లైన్ లో ఎలా నమోదు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రక్రియ వేగవంతంగా ఉండాలని చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నవజాత శిశువులకు కేటాయించిన సంరక్షణ విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంటును తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, సిబ్బంది కొరత, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైక్రియాట్రి, అనస్థీషియా తదితర విభాగాలకు పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది కొరతపై నివేదికను సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ ను ఆదేశించారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు
సిబ్బంది కొరతపై నివేదిక ఇవ్వాలని ఆదేశం


