గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
శ్రీనివాసపురం(కర్ణాటక) : కోలారు జిల్లాలో గంజాయిని రవాణా చేస్తున్న నలుగురిని శ్రీనివాసపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు పురుషులు, మదనపల్లికి చెందిన మహిళ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని జివి కాలనీ గేట్ సమీపంలోని ద్విచక్రవాహనంలో తరలిస్తున్న సమయంలో దాడి జరిపి పట్టుకున్నారు.
రేషన్ బియ్యం సీజ్
ములకలచెరువు : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించి సీజ్ చేశారు. సీఎస్‌డీటీ సుబ్బయ్య కథనం మేరకు.. మండలంలోని పర్తికోటకు చెందిన రెడ్డెప్ప తన ఫీడు దుకాణంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడులో 815 కేజీల బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడు రెడ్డెప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్ పేర్కొన్నారు.
అన్నదమ్ములపై దాడి
మదనపల్లె రూరల్ : స్థలం సమస్య కారణంగా ఏర్పడిన వివాదం, వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలం చేనేతనగర్‌లో జరిగింది. స్థానికంగా నివాసం ఉన్న రామచంద్ర కుమారుడు లోకేష్ (35) పెయింటర్‌గా, రెండో కుమారుడు రాజేష్ (30) ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తుంటారు. వీరికి స్థానికంగా ఉన్న మరికొందరితో స్థలం వివాదం ఉంది. ఈ క్రమంలో మంగళవారం నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద రాజేష్ పనులు చేస్తుండగా, అదే దారిలో వెళుతున్న మరో వర్గంలోని రెడ్డెప్ప, హరి, ప్రశాంత్ దూషించారు. దీంతో గొడవ మొదలైంది. రాజేష్ అన్న లోకేష్ అక్కడికి చేరుకుని అకారణంగా ఎందుకు గొడవకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు మరికొందరితో కలిసి అన్నదమ్ములపై దాడికి పాల్పడ్డారు. దాడిలో రాడ్ తీసుకుని కొట్టడంతో రాజేష్, లోకేష్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్


