గాయపడిన ఇంటర్ విద్యార్థి మృతి
కలికిరి : గాయపడిన ఇంటర్ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కలికిరి మండలం కలికిరి పంచాయతీ నర్రావాండ్లపల్లికి చెందిన సుబ్బారెడ్డి కుమారుడు మహీధర్‌రెడ్డి(17) తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. గత నెల 9న మంగళవారం అర్ధరాత్రి సమయంలో కళాశాలలో స్నేహితులతో కలిసి నాల్గవ అంతస్తు నుంచి కిందికి వెనుక వైపు నుంచి దిగతూ కిందపడి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు నెల రోజులు మృత్యువుతో పోరాడిన విద్యార్థి మహీధర్‌రెడ్డి సోమవారం ప్రాణాలు విడిచాడు. దీంతో అతనిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆశలు అడియాశలయ్యాయి. స్వగ్రామం నర్రావాండ్లపల్లిలో మహీధర్‌రెడ్డి మృతదేహానికి తల్లిదండ్రులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా విద్యార్థి మహీధర్‌రెడ్డి కళాశాల అధ్యాపకుల ఒత్తిడి భరించలేకే పారిపోయేందుకు యత్నించి ప్రమాదం పాలయ్యాడని అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంతాపం
విద్యార్థి మహీధర్‌రెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం నర్రావాండ్లపల్లిలోని వారి స్వగృహానికి చేరుకుని విద్యార్థి మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. ఏపీఎండీసీ మాజీ డైరెక్టరు హరీష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రమేష్‌కుమార్‌రెడ్డి, కాకతీయ రమణారెడ్డి, రవీంద్రనాథరెడ్డి, మహేంద్రరెడ్డి, బాలాజీ రెడ్డి తదితరులు విద్యార్థి మృతదేమానికి నివాళులు అర్పించారు.
గాయపడిన ఇంటర్ విద్యార్థి మృతి


