హెల్మెట్ ధారణతో ప్రాణాలు కాపాడుకుందాం
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
● రాయచోటిలో బైక్ ర్యాలీ
రాయచోటి : ‘రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నిబంధన కాదు. అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత’ అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటిలో హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప రింగ్ రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ నుంచి ప్రారంభమై చిత్తూరు జాతీయ రహదారి, మాసాపేట, బండ్లపెంట, ఠానా, నేతాజీ సర్కిల్, శివాలయం చెక్‌పోస్టు మీదుగా బంగ్లా వరకు ఉత్సాహంగా సాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, విద్యాసంస్థల ప్రతినిధులు, పట్టణంలోని బైక్ మెకానిక్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా రోడ్డు భద్రత నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాలలో జరిగే మరణాలలో అధికశాతం తలకు గాయాలు కావడం వల్లనే జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఐఎస్‌ఐ ముద్ర కల్గిన హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి ఎనభై శాతంకు పైగా తప్పించుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ట్రాఫిక్ సీఐ కులాయప్ప, రాయచోటి పట్టణ రూరల్ సీఐలు చలపతి, రోషన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎంవీఐ సుబ్బరాయుడు, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


