అక్రమ కేసులకు భయ పడొద్దు: పెద్దిరెడ్డి
రొంపిచెర్ల : అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గురికివారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలాజి మాజీ మంత్రిని కలిశారు. గత 25 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో ఉన్న శ్రీగంధం మొక్కలను చదును చేసుకునే క్రమంలో తొలగించానని, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారని మంత్రికి వివరించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి తొత్తులుగా పని చేస్తున్న అధికారుల పేర్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, తర్వాత అసలు, వడ్డీ కూడా తిరిగి ఇచ్చేదామని చెప్పారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఆనందనాయుడు, పరమేశ్వర, రామనారాయణరెడ్డి, అనిల్‌రెడ్డి ఉన్నారు.


