● కల నెరవేర్చిన మిథున్‌రెడ్డి
రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి చిత్తూరులోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాయల్పాడు, ఉమ్మడికడపలోని రాజంపేట, రాయచోటి, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఉండేది. 2009లో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగు కావడంతో దానిస్థానంలో పుంగనూరు నియోజకవర్గం కలిసింది. 1967 నుంచి 2014 వరకు అన్ని పార్టీలు కడపజిల్లాకు చెందిన వారినే అభ్యర్థులుగా ఎంపికచేసేవి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి చిత్తూరుకు అభ్యర్థిత్వం దక్కేదికాదు. ఇక్కడి ప్రజల నిరాశ, అసంతృప్తిని దూరం చేస్తూ 2014లో పిన్న వయస్కుడైన పీవీ.మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో నిలబడి గత ఎంపీల రికార్డులన్ని తిరగరాస్తూ 1,74,762 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల ఆశ నెరవేరింది.
హ్యాట్రిక్‌లో మిథున్‌రెడ్డి రికార్డు
2014 పార్లమెంటు ఎన్నిక బరిలో దిగేనాటి కి, అంతకుముందు పనిచేసిన ఎంపీలకంటే పిన్న వయస్కుడు పీవీ.మిథున్‌రెడ్డి. ఈ ఎన్నికలో తన ప్రత్యర్థి సాధారణ వ్యక్తికాదు. ఎన్టీఆర్ తనయ పురందేశ్వరీ బీజేపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికే అయినా మిథున్ రెడ్డి తన స్టామి నాను నిరూపించుకున్నారు. అప్పటిదాకా ఉన్న అభ్యర్థుల మెజార్టీని తిరగరాశారు. 1,74,762 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి పురందేశ్వరీని ఓడించారు. తర్వాత 2019 ఎన్నికలో తన రికార్డును తానే చెరిపేస్తూ 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజంపేట పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2024లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.


