బాధితులకు న్యాయం చేయాలి
మదనపల్లెరూరల్ : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి, న్యాయం అందించడమే పోలీసుల బాధ్యతని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులపై వచ్చిన అర్జీలను పరిశీలించారు. బాధితుల సమస్యలను విన్న వెంటనే, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తూ సామాన్యులను పీడించే వారిపై, ఆన్‌న్‌లైన్ మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు, మహిళలపై వేధింపులకు దిగే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డిఎస్పీ మహేంద్ర, సి ఐ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల మోసం..
చీటీల వ్యాపారి రెడ్డప్ప చీటీల నిర్వహణ పేరుతో రూ. 4.5 కోట్లు మోసం చేశాడంటూ వాల్మీకిపురానికి (వాయల్పాడు) చెందిన కొందరు బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణంలో నివాసమున్న చీటీల రెడ్డప్ప 179 మందికి రూ. 4.50 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనికి ఆస్తులు భారీగానే ఉన్నాయని, అతను వేసిన ఐపీని కోర్టు సైతం తిరస్కరించిందని, అయినా తమకు నగదు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఎస్పీకి తెలిపారు. స్పందించిన ఎస్పీ వెంటనే చీటీల రెడ్డప్ప ఆస్తులు జప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
దేవుడి పేరుతో కిలో బంగారు,
రూ.కోటి నగదు స్వాహా..
పట్టణంలోని బసినికొండ ప్రాంతానికి చెందిన ఆలయ పూజారిగా ఉన్న ఉంగరాల స్వామి అలియాస్ వెంకట శాస్త్రి కుటుంబ సభ్యులు తమకు చెందిన సుమారు కిలో పైగా బంగారు ఆభరణాలు, కోటి రూపాయలకు పైగా నగదు కాజేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మదనపల్లె పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడు బెంగళూరు వాసులకు కుటుంబ క్షేమం, ఆదాయవృద్ధికై వెంకట శాస్త్రి మండల పూజలు నిర్వహించే వాడన్నారు. పూజల్లో భాగంగా భక్తులు నగదు, నగలు స్వామికి అందించి 40 రోజులపాటు పూజలో ఉంచే వారన్నారు. పూజల అనంతరం తిరిగి భక్తులకు ఇచ్చేవాడన్నారు. రెండు నెలల క్రితం ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందాడన్నారు. ఆయన మరణానంతరం ఉంగరాల స్వామి దత్తపుత్రిక శైలజ, మనవడు తరుణ్ రెడ్డి తమ సొత్తులను కాజేసి పరారయ్యారన్నారు. దీనిపై వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ ఎస్పీ టూటౌన్ సీఐను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
బాధితులకు న్యాయం చేయాలి


