శిష్యుడి కోసం.. సీమను ఎడారి చేసిన చంద్రబాబు
రాజంపేట : రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సైంధవుడిలా అడుగడునా అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకు నిదర్శనమే రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేయడమని విమర్శించారు. సోమవారం తన ఎస్టేట్‌లో ఆకేపాటి విలేకర్లతో మాట్లాడుతూ తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి రాజకీయ ప్రయోజన చేకూర్చడం కోసం చంద్రబాబు రాయలసీమను ఎడారి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయించా.. కావాలంటే నిజనిర్ధారణ కమిటీతో తనిఖీ చేసుకోవచ్చునని అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపడం తెలిసిందేనన్నారు. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు.. శ్రీశైలానికి వరద జలాలను ఒడిసిపట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులు, రాజోలు, జొలదరాశి,కుందూ ఎత్తిపోతల లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కారు రాగానే పూర్తిస్థాయిలో నిలిపివేసిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. సీమ ఎత్తిపోతలపై ఆది నుంచి చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందనే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్‌జీటీ(చైన్నె) బెంచీలో తెలంగాణా రైతులతో టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్‌పిటిషన్ దాఖాలు చేయించిన సంఘటనను సీమ రైతులు మరిచిపోలేరన్నారు. ఎన్‌జీటీ, పర్యావరణ అనుమతి తీసుకొని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబరు 29న ఆదేశించిదన్నారు. ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. అధికారులు పనులు కూడా చేపట్టారన్నారు. కానీ గత ఏడాది పిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలిదశ పనులకు బ్రేక్ పడిందన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులుకొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయిందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏకాంత సమావేశంలో కుదిరిన ఒప్పందం వల్ల సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేయించారనడానికి ఇది మరో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారన్నారు. అలాగే బోగాపురం ఎయిర్‌పోర్టుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుంకుస్థ్ధాపన చేశారని, ఇప్పుడు ఆ ఎయిర్‌పోర్టు పూర్తయిన క్రమంలో ఆ క్రెడిట్ చోరీకి పాల్పడ్డ ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని అన్నారు.
ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం..
రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేసింది జగనేనని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని ఆకేపాటి కొట్టిపారేశారు. ఈ విషయం సీమ రైతులందరికి తెలుసునని ఆయ తెలిపారు. ఎల్లోమీడియా చంద్రబాబు కోసం విలువలను తుంగలోకి తొక్కేస్తుందనడానికి ప్రచురితమైన కథనం నిదర్శనంగా నిలుస్తోందని ఆకేపాటి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికి, ఆంధ్రజ్యోతి మాత్రం వైఎస్ జగన్ నిలిపివేశారని రాయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఆకేపాటి అమరనాథరెడ్డి


