యువకుడు ఆత్మహత్య
పెద్దమండ్యం : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని శిద్దవరం పంచాయతీ కోటగుట్టపల్లె హరిజనవాడలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ పి శ్రావణి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంపల శివానంద కుమారుడు రెడ్డిశేఖర (20) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉన్నాడు. ఇక్కడే డ్రైవర్, మెకానిక్ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. ఇటీవల సెల్‌ఫోన్ కొనుగోలు చేసి తరచూ గేములు ఆడటానికి అలవాటు పడ్డాడు. ఈ విషయమై తల్లిదండ్రులు ఒకసారి మందలించగా ఆత్మహత్యకు ప్రయత్నించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. తల్లిదండ్రులు రోజువారి కూలి పనులకు సోమవారం ఉదయం 6 గంటలకు వెళ్లగా ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రఘు (43) అనే వ్యక్తి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు వివరాలు..రఘు గత కొన్నేళ్లుగా బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పులవాళ్ల బాధ తాళలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కమలాపురం : కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన జమ్మల మడుగులో జరిగిన పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కమలాపురం జట్టు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో 400మీటర్ల రిలే పోటీల్లో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పోటీల్లో తృతీయ స్థానంలో తమ కళాశాల విద్యార్థులు నిలిచారని ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్ వీరాంజనేయులును ప్రిన్సిపల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.


