రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి
రాయచోటి అర్బన్ : రాయచోటి కేంద్రంగా 14 మండలాలను కలుపుకుని రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష కమిటీలో నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలోని ఎన్జీఓ హోంలో సమావేశమైన అఖిలపక్ష కమిటీ ఈ మేరకు తీర్మానించింది. రాయచోటికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రాయచోటిలో ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ బంగ్లాతో పాటు సుమారు 70 రకాల జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే జిల్లా కేంద్రం అలాగే ఉంటుందన్న భరోసాతో అన్ని వర్గాల ప్రజలు గ్రామాలలో ఆస్తులు సైతం అమ్ముకుని రాయచోటి కేంద్రంలో నివాసాలు, ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట, కేవీపల్లె, కలకడ, గుర్రంకొండ, పెద్దమండ్యం, ఎన్‌పి కుంట మండలాలతో పాటు రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలను కలిపి రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నేతలు తీర్మానించారు. ఈ సమావేశంలో భారత న్యాయవాదుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రామాంజనేయులు లోక్‌సత్తా నాయకుడు గిరిబాబు యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు కోటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి విశ్వనాఽథ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉద్యమ కార్యాచరణ సమావేశం..
ఈ నెల 6వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణ ప్రముఖులతో పాటు, అఖిలపక్ష కమిటీ నాయకులు రాయచోటి అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద సమావేశమై, 14 మండలాలతో కలిపి రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే విషయంపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు ప్రకటించారు.


