హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం
బి.కొత్తకోట : దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం బి.కొత్తకోట మండలం ఠానా మిట్ట వద్ద జరిగిన జిల్లా స్థాయి భూ పోరాట సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఎకరాల మిగులు భూములు గ్రామీణ నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కావాలంటే విద్య, వైద్యం, ఉద్యోగాలలో వాటా కావాలని అన్నారు, ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు తీసుకుంటున్న రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజా ఉద్యమాలను పోలీసులు చేత అణచివేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడానికే మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని పేదలకు భూమి ఇవ్వడం దానం కాదని రాజ్యాంగ బద్ధమైన హక్కు అని అన్నారు. భూ సంస్కరణలను కార్పొరేట్ లాభాల కోసం నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కేశవరెడ్డి, సత్యసాయి జిల్లా కార్యదర్శి కదిరెప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య


