కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఒంటిమిట్ట : భార్యాభర్తల గొడవల కారణంగా మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని దిగువ వీధిలో ఎన్.లాస్య ప్రియ(31) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు తెలిపారు. ఆదివారం ఒంటిమిట్ట పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఆయన ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 8 ఏళ్ల క్రితం నెల్లూరుకు చెందిన లాస్య ప్రియ ఒంటిమిట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందన్నారు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు భర్త బతుకుతెరువు కోసం కువైట్‌కు వెళ్లి, కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి వచ్చాడని తెలిపారు. వీరికి ఆరు సంవత్సరాల కూతురు కూడా ఉందని చెప్పారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలైన లాస్యప్రియ, అనిల్ మధ్య గొడవలు జరుగుతుండేవని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. దీంతో మస్థాపానికి గురై శనివారం రాత్రి 9:45 నుంచి 10 గంటల సమయంలో మృతురాలు తమ ఇంటిపైన ఉన్న మొదటి అంతస్తులోని బెడ్ రూమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. విషయం తెలుసుకున్న సీఐ నరసింహరాజు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని లాస్య ప్రియ మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య


