మున్సిపల్ అధికారి లైంగిక వేధింపులు?
● పారిశుధ్య మహిళా కార్మికులపట్ల
అసభ్య ప్రవర్తన
● మున్సిపల్ చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన మహిళా కార్మికులు
పులివెందుల : పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి మహిళా పారిశుధ్య కార్మికులపట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అలాగే పారిశుధ్య విభాగంలో పనిచేసే పలు చిరు ఉద్యోగులపై ఆయన వేధింపులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని ఆ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో పనులు చేసేందుకు వెళితే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని దాదాపు పలువురు మహిళా పారిశుధ్య కార్మికులతోపాటు మహిళా సచివాలయ సిబ్బందిని కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. కనీసం వారిని కూర్చోబెట్టకుండా మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని ఆరోపిస్తున్నారు. ఎవరికై నా చెప్పుకుంటే ఉద్యోగాలకు భద్రత, అవమానం, భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. చివరకు మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్‌కు ఆ ఉద్యోగులు మొర పెట్టుకున్నారు.


