చంద్రబాబు కుట్ర
జగన్‌కు పేరు రావద్దనే రాయలసీమ లిఫ్ట్‌పై
బి.కొత్తకోట: రాయలసీమ రైతుల సంక్షేమానికి ఒక్క పని చేయని చంద్రబాబు వైఎస్.జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలతో సాగునీటి కష్టాలు తీరితే.. తద్వారా జగన్ ప్రతిష్ట పెరుగుతుందన్న అక్కసుతోనే ఆ పథకానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులపైకి నీరు చేరాకే వాడుకోవాలని మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసి ఎడాపెడా నీటిని వాడుకోవడం మొదలు పెట్టిందన్నారు. దీనివల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని గత ప్రభుత్వంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గుర్తించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.3,600 కోట్లతో చేపట్టారన్నారు. గాలేరు నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్ కు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీటిని ఎత్తిపోసేందుకు ఈ పథకం అమలు చేశారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 800 అడుగుల నుంచే శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా నిర్ణయించారు. తద్వారా రాయలసీమ రైతులకు ఎనలేని ప్రయోజనం జరుగుతుందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగానే నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులతో కేసులు వేయించి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో అన్యాయం జరుగుతుందన్న తప్పుడు వాదన చేయించారన్నారు. ఇలా పథకం ప్రారంభం నుంచే అడ్డంకులు సృష్టిస్తూ వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం, దాని వెనక కుట్ర దాగిందన్న విషయం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డే ప్రపంచానికి చెప్పారన్నారు. ఎత్తిపోతల పనులు రూ.1,600 కోట్లు జరగ్గా, రూ.900 కోట్లు బిల్లులు మంజూరైతే అందులో రూ.779 కోట్లు గత ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాయలసీమ రైతాంగానికి మంచి చేయడం చేతకాని చంద్రబాబు..ఈ పథకాన్ని అడ్డుకోవడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఏ ప్రయోజనం ఆశించి పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టు చేపట్టినా చంద్రబాబు భరించలేరన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం నీటిని ఇష్టారీతిన వాడుకున్నా, అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా ఏనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించని చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రజల కోసం నిలిపివేయడం న్యాయమా అని నిలదీశారు. రైతాంగ ద్రోహానికి పాల్పడుతున్న చంద్రబాబు చర్యలను రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 2015లో అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెంచిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టారన్నారు. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను హరిస్తూ వచ్చినా చంద్రబాబు నోరుమెదపలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపి ద్రోహం చేసిన చంద్రబాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేసిన ద్రోహం క్షమించరానిదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.2 వేల కోట్లతో ముదివేడు, ఆవులపల్లె, నేతికుట్లపల్లె సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే చంద్రబాబు భరించలేకపోయారని అన్నారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా టీడీపీ కనమరుగువుతుందని కుట్రలు చేశారన్నారు. టీడీపీ నేతలతో అక్రమ కేసులు వేయించి పనులు ఆపి వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నర టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే ఈ ప్రాజెక్టుల వల్ల సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా పనులు చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్లు పూర్తి అయి ఉంటే కష్ణాజలాలతో కళకళలాడేవని, రైతులకు సాగునీటి కష్టాలు తీరెవని అన్నారు. ఇప్పుడు కష్ణా జలాలు వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబే కారణమని, ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్ రైతుల నుంచి కేసులు వేయించారు
రూ.1,600 కోట్ల పనులుజరిగినా నిలిపివేశారు
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి


