పీకేఎం ఉడా.. ఖాళీలే నిండా!
ఐదుగురు డెప్యూటేషన్
మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన పలమనేరు, కుప్పం, పుంగనూరు పట్టణాభివృద్ధి సంస్థకు ఉద్యోగుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పుష్కలంగా నిధులతో కళకళలాడాల్సిన ఈ సంస్థకు ఆశించిన మేర ఆదాయం లేకుండా పోతోంది. దీనికి సిబ్బంది కొరత కారణమైనప్పటికీ.. ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో ఈ సంస్థ ఇంకా ప్రజల్లోకే వెళ్లలేకపోతోంది. అసలు ఈ సంస్థకు ఉన్న అధికారాన్ని కూడా వినియోగించుకోలేని స్థితిలో ఉంది. ఈ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు మున్సిపాలిటీలు, మండలాలు ఉన్నాయి.
ఆదాయం లేదు
సిబ్బంది, విధులను నిర్వహించాల్సిన ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్న కారణంగా.. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. లేఔట్ల అనుమతులు, ఇళ్ల నిర్మాణాల ప్లాన్లను అనుమతులు, ఇలా పలు వాటి నుంచి ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బీపీఎస్, బీఆర్‌ఎస్‌లను అమలు చేస్తున్నారు. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా సంస్థ ఆదాయం సమకూరుతుంది. అయితే నిబంధనల ప్రకారం నిర్మించే ఇళ్లకు అనుమతులను ఇక్కడి నుంచి పొందాలి. అయితే తనిఖీలు లేని కారణంగా మండలాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలియడం లేదు. దీంతో సంస్థకు ఆదాయం లేకుండా పోయింది. ఈ మధ్య సంస్థకు వచ్చిన ఆదాయంలో రూ.3 కోట్ల నిధులను మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు మంజూరు చేశారు.
23 పోస్టులు ఖాళీలు
మొత్తం 28 మంది ఉండాల్సిన పీకేఎం ఉడా కార్యాలయంలో 23 మంది ఉద్యోగులు లేరు. ప్రభుత్వం వీటిని భర్తీ చేయకపోవడంతో ఔట్‌సోర్సింగ్‌పై ఒక అటెండర్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సంస్థకు ఆదాయ వనరులను తెచ్చిపెట్టే కీలకమైన ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలనాపరంగా ఉండాల్సిన పోస్టుల్లో కార్యదర్శి పోస్టు మాత్రమే భర్తీ అయ్యింది. మిగిలిన పోస్టులన్నీ ఖాళీయే. అయితే ఐదురుగు డెప్యూటేషన్‌పై ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీగా పోస్టుల్లో పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డి.స్టేనోగ్రాఫర్, క్లర్క్ కమ్ టైపిస్ట్, అటెండర్లు, చైన్‌మెన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ప్లానింగ్ ఆఫీసర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్, డ్రాఫ్ట్‌స్‌మెన్, అసిస్టెంట్ డ్రాఫ్ట్‌స్‌మెన్, సర్వేయర్ కమ్ డ్రాఫ్ట్‌స్‌మెన్, తహసీల్దార్, సర్వేయర్, హార్టికల్చరిస్ట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్‌మెన్, గార్డెన్ మేసీ్త్ర, గార్డెనర్స్, ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయలేదు.
ఖాళీ పోస్టుల్లో ఐదుగురు డెప్యూటేషన్‌పై సంస్థలో పని చేస్తున్నారు. ఒక అటెండర్, ఒక డీఈఈ, ఒక ప్లానింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, ఒక డ్రాఫ్ట్‌స్‌మెన్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణాభివృద్ధి సంస్థలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేసి సంస్థ కార్యకలాపాల విస్తరణకు, ఆదాయం సమకూర్చునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
28 పోస్టులకు 23 ఖాళీ
ఆ ఐదు పోస్టుల్లోనూడెప్యూటేషన్ ఉద్యోగులే
ఐదు నియోజకవర్గాల పరిధి.. సాగని పాలన
పీకేఎం ఉడా.. ఖాళీలే నిండా!


