టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూ అక్రమణ నిజమే
మదనపల్లె: మదనపల్లి పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నిర్ధారణ అయ్యింది. గత డిసెంబర్ 5న ఉప లోకయుక్త రజని ఇచ్చిన ఆదేశాల్లో ఈ విషయం స్పష్టమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక, గత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ కబ్జా వ్యవహారానికి అందించిన సహకారాన్ని గుర్తించారు. వారి పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో ఉప లోకయుక్త సూచించారు. పట్టణంలోని బికేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 8/1లో 2.92 ఎకరాల చెరువు భూమి ఉంది. గతంలో 142 మంది మాజీ సైనికులకు చింతచెట్ల ఫల సాయం అనుభవించేందుకు 2సీ పట్టాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. ఈ భూమి మాజీ సైనికుడు ఇంద్రసేన రాజుకు సంబంధించినదిగా మాజీ సైనికుని పేరిట నకిలీ పట్టాను సృష్టించారు. తర్వాత ఇంద్రసేన రాజు నుంచి టీడపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, ఆయన భార్య పేరిట రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీనిపై మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు లోకయుక్తను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన లోకాయుక్త నివేదికలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై జరిగిన విచారణలో వాస్తవాలను కలెక్టర్ నివేదించారు. అందులో ఈ భూమి చెరువు పోరంబోకుగా ఉందని నిర్ధారించారు. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు ఎవరికి కేటాయించరాదు. అయితే అప్పటికే మాజీ సైనికుని పేరిట నకిలీ పట్టాను సృష్టించారు. ఆ తర్వాత కథ నడిపారు.
ఈ నకిలీ పట్టా సృష్టికి, దొమ్మలపాటి రమేష్ పేరిట భూమి రిజిస్ట్రేషన్‌కు అధికారులు సహకరించినట్టు, తప్పుడు రికార్డులు సృష్టించినట్టు నిర్ధారించారు. అందులో గత తహసీల్దార్ శివరాంరెడ్డి సెలవు రోజైన ఆదివారం నాడు రికార్డుల్లో తప్పుడు పట్టా వివరాలను సృష్టించి నమోదు చేసినట్టు గుర్తించారు. ఇతనితోపాటు రెవెన్యూ పరంగా ఈ నకిలీ వ్యవహారానికి సహకరించిన అప్పటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్‌రెడ్డి, వీఆర్వో ప్రదీప్ కుమార్, ఆక్రమించిన భూమిలో జరిగిన నిర్మాణాలకు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ రవి, పట్టణ ప్రణాళిక అధికారి హయత్, డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్లు సహకరించారని, వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని సూచించింది. శివరామిరెడ్డి పదవీ విరమణ చేసినప్పటికీ రెవెన్యూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని తీర్పులో సూచన చేశారు. రూ.కోట్ల విలువ చేసే ఈ భూమి వ్యవహారంలో జరిగిన విచారణలో రెవెన్యూ ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించినప్పుడు ఇంద్రసేన రాజు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క, కుట్ర పూరితంగా వ్యవహారం నడిపినట్టు స్పష్టమైనది. జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొన్నవి వాస్తవాలే అని స్పష్టం చేసినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ భూమి వ్యవహారంలో ఇప్పటికే వాస్తవాలు నిర్ధారణ కావడం, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయడంతో ఈ కేసును ముగిస్తున్నట్టు ఉపలోకయుక్త రజని పేర్కొన్నారు.
రూ.కోట్ల విలువైన భూమికి సహకరించిన రెవెన్యూ అధికారులు
వాస్తవాలు తేల్చిన జిల్లా కలెక్టర్.. లోకాయుక్తకు నివేదిక
క్రిమినల్ చర్యలకు ఆదేశం
సహకరించిన అధికారులపై చర్యలు
ఉప లోకయుక్త తాజా ఆదేశం


