పొరపాటున వచ్చిన మందు
● ప్రైవేటు మెడికల్ షాపులో ప్రభుత్వ
మందు దొరకడంపై విచారణ
● డ్రగ్స్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశాషేక్
మదనపల్లె రూరల్: మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వినియోగిస్తున్న మెట్రెండోజెల్ పొరపాటుగా ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో లభించిందని డ్రగ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఆశా షేక్, ఏపీ ఎంఎస్‌ఐ డీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీపతిరెడ్డి తెలిపారు. డిసెంబర్ 31న మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి సరఫరా అయిన మెట్రెండోజెల్ ఐవీ మందు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ఉన్నట్లు అత్యవసర విభాగ వైద్యులు గుర్తించి, మీడియా సమక్షంలో ప్రైవేట్ మెడికల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఇదే విషయమై పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారణ చేశారు. పూర్తి స్థాయిలో ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లోను, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోనూ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు.
రోగి బంధువు ద్వారా వెళ్లినట్లు వెల్లడి
మందు ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ఇచ్చిన వ్యక్తిని గుర్తించి ఆసుపత్రికి పిలిపించారు. అతని వద్ద నుంచి జరిగిన విషయమై స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. పట్టణంలోని రామారావు కాలనీ సోనీ వీధికి చెందిన రామకృష్ణ తన భార్యకు జ్వరంగా ఉండటంతో డిసెంబర్ 31న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వచ్చాడన్నారు. డాక్టర్లు పేషెంట్‌కు రెండు పారాసెటమాల్ ఐవీ ఇంజెక్షన్లు, మూడు మెట్రెండోజోల్ 3 ఇంజెక్షన్లు చికిత్సలో భాగంగా సూచించారన్నారు. చికిత్సలో రెండు పారాసెటమాల్ ఇంజెక్షన్లు, రెండు మెట్రో సెల్ ఇంజెక్షన్లు వినియోగించారన్నారు. అయితే మిగిలిన ఒక మెట్రో సెల్ ఐవీ ఇంజెక్షన్‌ను బాధితురాలి అత్త పారాసెటమాల్ బాక్సులో ఉంచి పక్కన పెట్టింది. కుమారుడు రాగానే మందు మిగిలిందని చెప్పడంతో, రామకృష్ణ నేరుగా తీసుకువెళ్లి ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో వెనక్కి ఇచ్చి, డబ్బు వాపస్ తీసుకుని వెళ్లిపోయాడన్నారు. మెడికల్ స్టోర్ సిబ్బంది లోపల ఉన్న మందు గమనించకుండా అలాగే ఉంచుకున్నారన్నారన్నారు. ఈ ఘటన పొరపాటుగా జరిగింది తప్ప, ప్రభుత్వ ఆసుపత్రి మందులు బయటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలా ఎక్కడైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మన్సూర్ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా కాలేదని
చెప్పిన డీసీహెచ్‌ఎస్
మదనపల్లి ప్రభుత్వాసుపత్రి మందులు ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో లభ్యం కావడంపై విచారణ చేసిన డీసీహెచ్‌ఎస్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మెడికల్ స్టోర్‌లో దొరికిన మందు కుచ్ సంబంధించిన బ్యాచ్ నంబర్ మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా కాలేదంటూ, ఐ అండ్ పీఆర్ శాఖ ద్వారా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేరుతో పత్రిక ప్రకటన ఇప్పించారు. విచారణలో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో వాడుతున్న మందుల బ్యాచ్ నంబర్ గమనించారే కానీ, అంతకుముందు ఆసుపత్రికి సరఫరా అయిన బ్యాచ్ నంబర్లు గుర్తించకపోవడంతో, ఇదే విషయమే విచారణ చేసిన డ్రగ్స్ విభాగం అధికారులు బ్యాచ్ నంబర్ ద్వారా, మెట్రెండోజోల్ ఐవీ మందు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా అయిందని నిర్ధారించారు. రోగులు పొరపాటుగా తీసుకెళ్లి ఇవ్వడంతో ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో ప్రత్యక్షమైనట్లు విచారణ ద్వారా నిరూపించారు. అయితే డీసీహెచ్‌ఎస్ సరైన విచారణ చేయకుండా హడావిడిగా పత్రిక ప్రకటన ఇప్పించి, సదరు మందు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా కాలేదని నిరూపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యపు విచారణతో ప్రజలకు నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదంటూ పలువురు చర్చించుకుంటున్నారు.


