వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్‌లు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షిణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం వాల్మీకిపురంలో జరిగింది. గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక వైపున ఉన్న వాల్మీకినగర్‌లో నివసిస్తున్న సమర కుమారుడు నరసింహులు(37) స్థానికంగా కూలిపనులు చేస్తూ జీవించేవాడు. కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన కిందకు దించి స్థానిక సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. వాల్మీకిపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
రిమ్స్ మార్చురీలో వృద్ధుని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందేందుకు గుర్తు తెలియని వృద్ధుడు చేరాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వృద్ధుని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు.
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం


