వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
రాయచోటి అర్బన్ : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలో ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయని ఆయన శనివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మట్కా, గంజాయి బ్యాచ్‌లు, ముసుగు దొంగలు బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపై దాడులకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటు చర్య అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం చెరువుముందరపల్లెకు చెందిన రామచంద్రారెడ్డిపై కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం తరలిపోయిందని బాధతో సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టిన వారిపై హత్యాయత్నాలు చేయడం ఎందుకు ? సాధారణ కార్యకర్తలపై దాడులు చేయడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. నా పైన దాడి చేస్తారో, హత్య చేస్తారో రండి, అంతే కానీ మా కార్యకర్తలపై, ప్రజా సంఘాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి చిల్లర దాడులు ప్రజాస్వామ్యంలో సహించబోము అని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పెరగడానికి పోలీసు వ్యవస్థ గట్టిగా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణం అని ఆరోపించారు. అధికార పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, మీడియాను బెదిరిస్తూ దాడులకు పాల్పడిన వారి మనుగడే లేకుండా పోయిందన్నారు. సంబేపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సహా పార్టీ అనుచరులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం అనుచితమని అన్నారు. అక్రమాలు , అన్యాయాలు , బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
రామచంద్రారెడ్డికి మాజీ ఎమ్మెల్యే
గడికోట మోహన్‌రెడ్డి పరామర్శ
రామాపురం : టీడీపీ వర్గీయుల చేతిలో తీవ్రంగా గాయపడిన మండలంలోని చిట్లూరు గ్రామ పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మార్పురి ఆదిరెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డిని మాజీ ఎమ్మేల్యే గడికోట మోహన్ రెడ్డి పరామర్శించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున పూర్తి స్థాయిలో తోడుగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో సూరం వెంకటసుబ్బారెడ్డి, నెర్సుపల్లి నాగేంద్రరెడ్డి, దువ్వూరి ఆంజనేయులు, శ్రీధర్ రెడ్డి, గాలివీటి ప్రవీణ్‌రెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం


