హైస్కూల్ గేట్లకు కరెంటు సరఫరా
● విద్యార్థికి స్వల్ప షాక్..తప్పిన ప్రమాదం
● ఉలిక్కి పడిన విద్యార్థులు..తల్లిదండ్రులు
కురబలకోట : మండలంలోని ముదివేడు జెడ్పీ హైస్కూల్ గేట్లకు గుర్తు తెలియని వ్యక్తులు కరెంటు వైర్లు అమర్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం ఉదయం ముందుగా వచ్చిన రెడ్డిశేఖర్ అనే విద్యార్థి హైస్కూల్ గేటు తెరవబోయాడు. ఒక్కసారిగా జిల్లుమని షాక్ కొట్టినట్లుగా అన్పించింది. నిశితంగా చూడగా మెయిన్ గేటుకు, పక్కనున్న మరో చిన్న గేటుకు కూడా కరెంటు వైర్లు ఉండటం గమనించాడు. టీచర్లు రాగా వారి దృష్టికి తీసుకెళ్లాడు. వారు పరిశీలించగా హైస్కూల్‌లో తాగునీటి బోరు వద్ద నున్న ఫీజు క్యారియర్ల నుంచి దగ్గర్లోనే ఉన్న మెయిన్ గేటుకు పక్కనే ఉన్న మరో చిన్న గేటుకు కరెంటు వైర్లు అమర్చినట్లు గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్ చంద్రకళ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిసరాలను పరిశీలించారు. ఎవరు..ఎందుకు కరెంటు సరఫరా పెట్టారో అంతుబట్ట లేదు. విద్యార్థికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. రాత్రి వేళ వాచ్‌మెన్ ఉంటాడు. ఉదయం వెళ్లిపోతాడు. ఆయన చిన్నగేటు ద్వారా శుక్రవారం ఉదయం బయటకు వెళ్లినట్లు సమాచారం. అప్పట్లో కరెంటు వైర్లు లాగినట్లు లేదు. అతను వెళ్లిన అనంతరమే ఎవరో హైస్కూల్‌లోకి ప్రవేశించి ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూల్ సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంక్‌కు నీళ్లు వదిలే స్టార్టర్ ఫీజు క్యారియర్ల ద్వారా ఈ చర్యకు దిగాడు. మెయిన్ గేటుకు పక్కనున్న చిన్న గేటుకు కూడా కరెంటు వైర్లు అమర్చాడంటే ఎంత పకడ్బందీగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నా ఏ గేటు నుండి వచ్చినా గేటు ముట్టుకుంటే కరెంట్ షాక్‌కు గురవ్వాలన్న పక్కా ప్లాన్‌తో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. అదృష్ట వశాత్తు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు శనివారం కూడా విద్యార్థులను, టీచర్లను విచారించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సాంకేతిక సహకారంతో ఈ మిస్టరీని ఛేదిస్తామని ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఈ సంఘటనపై డీఈఓకు సమాచారం పంపినట్లు ఎంఈఓ ద్వారకనాథ్ తెలిపారు.


