24 గంటల్లోనే దోపిడీ దొంగల గుర్తింపు
● ఇద్దరు నిందితులు అరెస్టు,
రూ.2.18 లక్షలు నగదు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ కృష్ణ మోహన్
గాలివీడు : మండలంలోని నూలివీడు గ్రామంలో రూ.2.18 లక్షల నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. శనివారం గాలివీడు పోలీస్ స్టేషన్‌లో రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. గోపనపల్లె గ్రామానికి చెందిన షేక్ సాహెబ్ పీర్ కుమారుడు షేక్ మొహమ్మద్, షేక్ రహంతుల్లా కుమారుడు షేక్ బాబా ఫక్రుద్దీన్‌లు వృత్తి రీత్యా డ్రైవింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాల కోసం పలు చోట్ల అప్పులు చేయడంతో వాటిని తీర్చలేక దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న నూలివీడు గ్రామానికి చెందిన పందికుంట ఈశ్వరమ్మ బ్యాంకు నుంచి నగదు తీసుకుని వస్తుండగా, బైక్‌పై వచ్చిన నిందితులు ఆమెను బెదిరించి రూ.2.18 లక్షల నగదు సంచిని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి రూ.2.18 లక్షలు నగదు, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్ పిడి కలిగిన చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన గాలివీడు ఎస్‌ఐ నరసింహారెడ్డిని డీఎస్పీ కృష్ణ మోహన్ అభినందించారు.అనంతరం ప్రజలు తమ దుకాణాలు, నివాసాలు, కార్యాలయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, గాలివీడు ఎస్‌ఐ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


