సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచాలి
రాయచోటి: సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులలో అవగాహన పెంచాలని, వ్యవసాయంలో పీ–4 అమలు చేసి ఆదర్శ రైతులను మార్గదర్శకులుగా చూపించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ ఆదర్శ రాజేంద్రన్, భూమాత రక్షణ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి భూమాత రక్షణ కార్యక్రమంలో వివిధ అంశాలను జిల్లా సంయుక్త కలెక్టర్‌కు, కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉద్యానవన కృషి విజ్ఞాన కేంద్రం వారు రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రాయచోటి: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదని, సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసాలు ఇతర సమస్యలపై ఎస్పీ స్వయంగా విచారణ జరిపారు. నడవలేని స్థితిలో వచ్చిన వారు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించారు.


