● అన్నమయ్యకు ఏదీ మోక్షం | - | Sakshi
Sakshi News home page

● అన్నమయ్యకు ఏదీ మోక్షం

Nov 4 2025 7:34 AM | Updated on Nov 4 2025 7:34 AM

● అన్నమయ్యకు ఏదీ మోక్షం

● అన్నమయ్యకు ఏదీ మోక్షం

● అన్నమయ్యకు ఏదీ మోక్షం

అన్నీ అలాగే...

సాక్షి రాయరోటి: కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాదిన్నరకు పైగా అవుతున్నా ఇప్పటికీ అభివృద్ధి జాడ కనిపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు పరిస్థితి తయారైంది. పెండింగ్‌ పనులు కూడా ఎక్కడికక్కడే మిగిలిపోయాయి. సర్కార్‌ ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం, నిధులు ఎవరూ అందించకపోవడంతో అలాగే ఉండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా రైల్వేకోడూరు, మదనపల్లె, రాయచోటి, పీలేరులకు సంబంధించి గతంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు పలు హామీలు ఇచ్చినా...ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినా కూడా వాటి విషయంలో ప్రత్యేక దృష్టి సారించలేదు. కనీసం జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలోనైనా చర్చించి అభివృద్ధి విషయంలో అడుగు ముందు వేయాలని పలువురు కోరుతున్నారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

జిల్లా కేంద్రమైన రాయచోటిలో అభివృద్ధి పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అంతకుముందు వైఎస్సార్‌సీపీ సర్కార్‌ హయాంలో నిధుల వరదతోపాటు అభివృద్ధి పరుగులు తీయగా, ప్రస్తుతం కుంటుపడింది. అప్పట్లో రింగ్‌రోడ్డుకు మోక్షం లభించగా, ఇప్పుడు పనులు మొదలుపెట్టారు. అలాగే రాయచోటిలోని జాతీయ రహదారి వెంబడి పలువురు జాతీయ నాయకులతోపాటు మహాత్ముల విగ్రహాలు నెలకొల్పారు. ఇప్పటికీ సుందరీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఎంఐజీ లే అవుట్‌, రింగ్‌రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాల్సి ఉంది. క్రికెట్‌ స్టేడియానికి సంబంధించిన పనులు కూడా దాదాపు 80 శాతం పూర్తయినా 20 శాతం పనుల పూర్తిలో ఇంకా తాత్సారం కొనసాగుతోంది. శిల్పారామానికి సంబంధించి ప్రహారీతోపాటు ఇతర నిర్మాణాలు, స్థల కేటాయింపు లాంటి పనులు పూర్తయినా ఇప్పటికీ అక్కడ ఒక్క ఇటుక వేసింది లేదు. మరోవైపు జిల్లాలోని నగర వన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది.

అన్నదాతకు ఏదీ చేయూత?

ఇటీవల కాలంలో వరుస తుపాన్లు అన్నదాతను అతలాకుతలం చేశాయి. రైతులు పంటలను నష్టపోయారు. మోంథా తుపాను వల్ల కూడా సుమారు 500 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. అయితే పంటల బీమా ప్రీమియం చెల్లించని నేపథ్యంలో బీమా సొమ్ము వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదా పరిహారం లాంటివి అందించి ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

గిట్టుబాటు కోసం ప్రతిసారి తప్పని ఆందోళన

జిల్లాలో గిట్టుబాటు ధర కోసం అన్నదాతలకు ప్రతిసారి ఆందోళన తప్పడం లేదు. ఇటీవల కాలంలో మామిడికి సంబంధించి ఒక్కసారిగాఽ ధరలు తగ్గించడంతో రైతన్నలు నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల కిందట బొప్పాయి రైతులకు సంబంధించి రైల్వేకోడూరులో దళారులు ధరలు తగ్గించి రైతులతో చెలగాటం ఆడడంతో ఉద్యమించారు. అలాగే ఇటీవల టమాటాకు కూడా ధరలు తగ్గిపోవడంతో అన్నదాత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నేడు డీఆర్‌సీ

జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అభివృద్ధి సలహా మండలి (డీఆర్‌సీ) సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డితోపాటు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌, జేసీ, ఇతర ఉన్నతాఽధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో అబివృద్ధి సంబందించిన అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించాలని జిల్లా వాసులు కోరుతున్నారు..

జిల్లాలోని రాజంపేట పరిధిలో నాలుగేళ్ల కిందట వరద తాకిడి నేపథ్యంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అప్పట్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినప్పటికీ అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పునర్నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టి టెండరు దశ వరకు తీసుకు వచ్చారు. అయితే కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే టెండర్ల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ డిజైన్లు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికీ అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణంలో అడుగులు ముందుకు పడకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన అడుగులు ముందుకు పడటం లేదు. ప్రధానంగా అప్పట్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు రైల్వేకోడూరుతోపాటు మదనపల్లెకు అనేక హామీలు గుప్పించారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి రాగానే హామీలు నెరవేరుతాయని ఆశతో ఉన్న ప్రజలపై నీళ్లు చల్లారు. ప్రధానంగా రైల్వేకోడూరులో పండ్ల రసాల పరిశ్రమ మొదలుకొని ఇతర హార్టీకల్చర్‌ హబ్‌ నిర్మాణాలు అంటూ ఊదరగొట్టినా ఇప్పటికీ అతిగతీ లేదు. అలాగే మదనపల్లె–బెంగళూరురోడ్డు విస్తరణ నిర్మాణ పనులు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పినా వాటి ఊసే లేదు. రాయచోటిలో ఇటీవల వరదలు ముంచెత్తిన తరుణంలో ఒక చిన్నారితోపాటు ఇరువురు మృత్యువాత పడ్డారు. రాయచోటిలో కాలువలపై ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ముందుకు పోతున్నా ఎవరూ పట్టించకోవడం లేదు. ఎక్కడ చూసినా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాయచోటిలో పెద్ద ఉపద్రవ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

రాయచోటిలో ఎక్కడికక్కడేపెండింగ్‌ పనులు

అన్నమయ్య ప్రాజెక్టుకు పడని ముందడుగు

మోంథా తుపానువల్ల నష్టపోయిన రైతులు

పరిహారం కోసం ఎదురుచూపులు

నేడు జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement