వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చరిత్రాత్మకం
శ్రీనివాసుని కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులు
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయరహదారిలోని అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన గోవిందుని ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్టమహోత్సవాలను మూడురోజులు పాటు నిర్వహించింది. తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో ఎట్టకేలకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీహరి ఉత్సవర్లను వేదపండితులు కల్యాణవేదిక వద్దకు వేంచేపుచేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూశాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి పులకించారు. చివరిగా ప్రాకారోత్సవం, ధ్వజావరోహణతో ఆలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం ముగిసింది. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్ధానం చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, ప్రశాంతి, సంఘసేవకుడు ఉద్దండం సుబ్రమణ్యం, తాళ్లపాక గ్రామస్తులు, ఏఈవో బాలరాజు, సూపరిండెంట్ హనుమంతయ్య,టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, అర్చకులు పాల్గొన్నారు.
● అంతుకుముందు కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం 9.30గంటల నుంచి 10.30 గంటలలోపు ధనురలగ్నం నందు మహాకుంభప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టాన్యాసములు, ప్రథమ కాలారాధనం, మహామంగళహారతి, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు.
అన్నమయ్య చెంతకు చేరిన శ్రీవారు
రాజంపేట రూరల్: వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వాగ్గేయకారుడు అన్నమాచార్యుల జన్మస్థలంలో నిర్మించటం చరిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. కె బోయనపల్లిలోని అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద సోమవారం వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొన్న ఆకేపాటికి టీటీడీ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే వారు ముందుగా ఇక్కడే స్వామి వారిని దర్శించుకొనే భాగ్యం కలిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
వైభవంగా శ్రీనివాసుని కల్యాణం


