నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా

Aug 4 2025 3:30 AM | Updated on Aug 4 2025 3:30 AM

నల్లత

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా

కలికిరి(వాల్మీకిపురం) : ప్రభుత్వ, అటవీ భూముల్లో చెట్లను నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అటవీ చట్టం 1967, ఏపీ వాల్టా 2002 చట్టం మేరకు చెట్లను నరికివేయడం నిషేధం. ప్రభుత్వ ప్రయోజనాలకు అవసరమైతే సంబంధిత జిల్లా కలెక్టర్‌కుగానీ, జిల్లా అటవీశాఖ అధికారికి గానీ ఫారం–13 మేరకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా స్థాయి అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించి చెట్ల నరికివేతకు అనుమతులు ఇవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఆయా గ్రామస్తుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలం మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ జ్యోతి, భర్త సురేష్‌ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ భూములలోని ఏళ్ల నాటి నల్లతుమ్మ చెట్లను విక్రయించి సొమ్ముచేసుకున్న ఘటన వెలుగు చూసింది. మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 409లో గల తిమ్మిరెడ్డికుంటలో చెట్ల నరికివేతకు అటవీశాఖ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొందాడు. కేవలం చెట్లు కత్తిరించేందుకు మాత్రమే అటవీశాఖ అధికారులు అనుమతులు జారీ చేశారు. ఇదే అదనుగా భావించిన సురేష్‌ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని తిమ్మిరెడ్డికుంట సమీపంలోని కొత్తకుంటపై కన్నేసి ఆ కుంటలోని చెట్లను అక్రమంగా విక్రయించేశాడు. అయితే అటవీశాఖ అధికారులు కలప ట్రాన్స్‌పోర్ట్‌కు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. నల్లతుమ్మ కొయ్య కలపకు మంచి డిమాండ్‌ ఉండటంతో వాల్మీకిపురానికి చెందిన కొయ్య వ్యాపారులు అక్రమంగా నల్లతుమ్మ కలపను తరలించినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల్లో చెట్ల నరికివేతపై గ్రామస్తులు ప్రశ్నించినా పంచాయతీ కార్యదర్శిగానీ, సర్సంచ్‌గానీ సమాధానం చెప్పక పోవడంతో గ్రామస్తులు ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారుకు ఫిర్యాదు చేసి అక్రమాలపై వినతిపత్రాలు అందజేశారు. వారు స్పందించక పోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల్లో చెట్ల నరికివేతలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, అక్రమాలకు అధికారులు వత్తాసు పలికారని, క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారులు విచారిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అటవీశాఖ అధికారుల చేతివాటం..

తరిగొంట అటవీ బీట్‌ పరిధిలోని మంచూరు గ్రామ పంచాయతీలోని తిమ్మిరెడ్డికుంటలో ఉన్న నల్లతుమ్మచెట్ల నరికివేతకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు మంజూరుకు, అనుమతులు లేని మరో కొత్తకుంటలో చెట్ల నరికివేతకు సంబంధిత అటవీ బీట్‌ అధికారి సుబ్బలక్ష్మీ, ఇన్‌చార్జి సెక్షన్‌ అధికారి సుధాకర్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొత్తకుంట, తిమ్మిరెడ్డికుంట నుంచి కలప అనుమతులు లేకుండా తరలుతున్నా కేవలం నామమాత్రంగా ఒక టన్నుకు మాత్రమే జరిమానా విధించి రశీదు ఇచ్చారు. విక్రయదారు, కలప వ్యాపారుల నుంచి అటవీశాఖ అధికారులకు మామూళ్లు ముట్టడంతోనే కలప ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతులు లేకున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అక్రమాలపై విచారణ జరిపించాలి

మంచూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తకుంట, తిమ్మిరెడ్డికుంటలలో సుమారు 50 ఏళ్ల కాలం నాటి నల్లతుమ్మచెట్లను నరికివేశారు. గ్రామస్తులు అభ్యంతరం తెలిపినా అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. చెట్లను విరివిగా నాటాలని, కాపాడాలని ప్రభుత్వాలు చెబుతున్నా ఇలా చెట్లను నరికివేయడం అన్యాయం. ప్రభుత్వ భూములలో చెట్లు అక్రమంగా నరికివేతపై సమగ్ర విచారణ చేపట్టాలి.

– శంకర్‌రెడ్డి, మంచూరు గ్రామం

అడ్డగోలుగా ప్రభుత్వ కుంటలలో చెట్ల విక్రయం

అటవీశాఖ అధికారుల చేతివాటంతో యథేచ్ఛగా తరలిస్తున్న వైనం

స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోని అధికారులు

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా1
1/2

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా2
2/2

నల్లతుమ్మ చెట్ల అక్రమ రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement