
మద్యానికి బానిసలై ఇద్దరి మృతి
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో మద్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలోని బసినికొండకు చెందిన లక్ష్మన్న, పద్మ దంపతుల కుమారుడు పవన్ (40)కు 15 సంవత్సరాల క్రితం భారతితో వివాహం కాగా, పెళ్లయిన ఏడాదికే ఆమె అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటినుంచి పవన్ మద్యానికి బానిసై, పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. ఆదివారం బసినికొండ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మార్పురి వీధికి చెందిన ఖాదర్ బాషా కుమారుడు షరీఫుద్దీన్ (38) మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యం తాగేవాడు. అతని భార్య హమీదా స్థానికంగా కూలి పనులకు వెళ్తూ కుమారుడిని కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె పనులకు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగా, భర్త షరీఫుద్దీన్ అపస్మారక స్థితిలో పడి ఉండగా, గమనించి వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి స్థానికుల సాయంతో తరలించింది. పరీక్షించిన వైద్యులు బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఇంటికి తీసుకువెళ్లారు.