
సెప్టెంబర్ 8 నుంచి కడపలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సెప్టెంబర్ 8,9,10, తేదీలలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో
భూ పంపిణీ –సాగునీరు – పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశాలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 200 మంది జాతీయ నాయకులతో పాటు కేరళ, బెంగాల్, త్రిపుర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎన్నికై న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఉంటే ప్రభుత్వ భూముల్లో ఉంటాము– లేకుంటే జైల్లో ఉంటాము‘ అనే నినాదంతో వ్యవసాయ కార్మికులందరూ గ్రామ, గ్రామాన దండుగా ఐక్య భూ పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూమిలేని గ్రామీణ నిరుపేదలకు భూ పంపిణీ చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ప్రతి వ్యవసాయ కార్మికునికి రోజువారీ కూలి 1000 రూపాయలు ఇస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ, అదానీలకు 20 లక్షల కోట్ల ఆదాయం పెంచారని, వ్యవసాయ కార్మికులకు రోజువారి ఆదాయం 200 కూడా పెంచలేదని విమర్శించారు. జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో 20 గ్రామాలలో భూ పోరాటాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎం.సుబ్బమ్మ, చేతి ఉత్పత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.పి.బయన్న, వీ.శివ నారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.చిన్ని, వి.శివకుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య తదితరులు పాల్గొన్నారు.