
లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. వేంపల్లి దళితవాడకు చెందిన శంకర (52) బెంగళూరు రోడ్‌లో సప్లయర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంలో వ్యక్తిగత పనులపై చీకల బైలుకు వెళ్తుండగా, మార్గమధ్యంలోని బార్లపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.