
హార్సిలీహిల్స్‌లో ముమ్మరంగా తనిఖీలు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ను శనివారం సాయంత్రం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొండపై ఇప్పటిదాకా పోలీసుల తనిఖీలు లేకపోవడటంతో బైక్‌లపై విన్యాసాలు, బహిరంగంగా మద్యం తాగడం, వచ్చే పర్యాటకులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనిపై స్పందించిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో స్థానిక సీఐ జీవన్ గంగనాధ్‌బాబు, మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ, ముదివేడు, ములకలచెరువు, మదనపల్లె రూరల్, పెద్దతిప్పసముద్రం ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, రామచంద్ర, చంద్రమోహన్, హరిహర ప్రసాద్‌లు, 50 మంది కానిస్టేబుళ్లతో తనిఖీలు నిర్వహించారు. ఘాట్‌రోడ్డుపై వస్తున్న బైక్‌లను తనిఖీ చేసి లైసెన్సులు ఉన్నాయా లేదా, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు బైక్‌లు నడపడం లాంటి వాటిపై చర్యలు తీసుకున్నారు. ఘాట్‌రోడ్డు ప్రయాణంలో సాహస విన్యాసాలకు పాల్బడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బైకర్లను హెచ్చరించారు. కొండపై ఉన్న అతిథి గృహాల నిర్వాహకులతో మాట్లాడారు. అతిథి గృహాల్లో విడిదిచేసే పర్యాటకులు ఎక్కడినుంచి వచ్చారో వారి వివరాలు, చిరుమానాలు సేకరించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ మహేంద్ర, సీఐ జీవన్ గంగానాథ్‌బాబు నిర్వాహకులను, టూరిజం సిబ్బందిని కోరారు. అనంతరం గాలిబండ అంచులోకి వెళ్తున్న పర్యాటకులను ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.