
అంతా మదనపల్లె నుంచే..
తదుపరి చర్యలు ఏమిటి..
● మంత్రి సమీక్షలో బట్టబయలైన అధికారుల తీరు
● 2018లో కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 కేటాయింపు
● కుప్పంలో ఏర్పాటు చేయకుండామదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలోనేడివిజన్ నిర్వహణ
● సీఎం చంద్రబాబుకే మస్కా
● రూ.169 కోట్ల పనులున్నా మదనపల్లె నుంచే పర్యవేక్షణ
● అధికారులు హెడ్‌క్వార్టర్ కుప్పంలోనివాసం లేరని మంత్రే నిర్దారణ
మదనపల్లె: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పని చేయాల్సిన హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు కుప్పానికి వెళ్లకుండా మదనపల్లెను వదలకుండా ఉండిపోతున్నారు. కుప్పంలో రూ. కోట్ల పనులు జరుగుతున్నా మేం ఇక్కడే ఉంటాం.. ఇక్కడినుంచే పర్యవేక్షిస్తామన్నట్లుగా అధికారుల ధోరణి వ్యక్త మవుతోంది. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే సాహసం ఏ అధికారి చేయడు. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులకు మాత్రం ధైర్యం, సాహసం ఉందని చెప్పాలి. 2018లో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు హంద్రీ–నీవా డివిజన్–12 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా కుప్పానికి తరలి అక్కడినుంచే పాలన సాగించాలి. అయితే ఈ ఉత్తర్వు కేవలం కాగితానికే పరిమితమైపోయింది. ఈ ఉత్తర్వు సమయంలో కుప్పం ఉపకాలువ పనులు సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణ సులువుగా, అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఒకటి తలిస్తే ప్రాజెక్టు అధికారులు మరోకటి తలిచారు. సీఎం నియోజకవర్గమైతే మాకేంటి అనుకున్నారేమో కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకుండా, మదనపల్లె నుంచే విధులు నిర్వహించే సాహసం హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులది. 2015లో రూ.430 కోట్లతో టీడీపీ ప్రభుత్వం కుప్పం ఉపకాలువ పనులను చేపట్టింది. దీనితో అప్పటినుంచి మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్న అధికారులు మదనపల్లె నుంచి కాకుండా కుప్పంలో ఉంటూ విధులు నిర్వహించేలా 2018లో కుప్పానికి డివిజన్ మంజూరు చేశారు. ఉన్నతాధికారులు కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసి.ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇద్దరు డీఈఈలు, ఆరుగురు జేఈలు, ఆరుగురు క్లరికల్ సిబ్బంది, నలుగురు సాంకేతిక సిబ్బంది, మరో ఆరుగురు సాబార్డినేట్ సిబ్బంది ఇక్కడి నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఇందులో చిత్తూరుజిల్లా వీ.కోటలో ఒక డీఈ, పలమనేరులో ఒక డీఈ వారికింద కొందరు జేఈలు విధుల్లో ఉండాలి. అయితే ఇప్పటివరకు డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి సాహసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈఈకి మూడు చార్జ్ మెమోలు
కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లుకు ఏకంగా మూడు చార్జ్ మెమోలను జారీ చేయాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించడం హంద్రీ–నీవా ప్రాజెక్టు వర్గాల్లో కలకలం రేగాలి. అయితే దీనిపై అధికారులు టేకి ట్‌ఈజీ అన్న ధోరణిలో కనిపిస్తున్నారు. సాక్షాత్తు మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీస స్పందనం లేదు. మంగళవారం మంత్రి ప్రాజెక్టు ఉపకాలువల పనులపై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. కుప్పం కాలువ పనులకు సంబంధించి ఈఈ వెంకటేశ్వర్లు మీటింగ్‌కు హజరుకాలేదు. దీనికితోడు హెడ్‌క్వార్టర్ కుప్పం లేరని నిర్దారించి చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకటి..హెడ్ క్వార్టర్‌లో ఈఈ నివాసం ఉండకపోవడం, రెండు..లైనింగ్ పనుల పూర్తిలో చురుగ్గా వ్యవహరించకపోవడం, మూడు..సమావేశాలకు హజరుకాకపోవడంపై చార్జ్ మెమోలను ఇవ్వాలని ఆదేశించారు. ఈ చార్జ్‌మెమోలను తిరుపతి చీఫ్ ఇంజనీర్ జారీ చేస్తారని ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్ బుధవారం సాక్షికి చెప్పారు.
ఈఈకి మూడు చార్జ్‌మెమోలను ఇవ్వాలని ఆదేశించిన మంత్రి మదనపల్లెలో జరుగుతున్న కుప్పం డివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెడతారా లేదా అన్నది తేలాలి. ఈఈ హెడ్‌క్వార్టర్‌లో నివాసం లేరని తేల్చగా ఇప్పుడు అక్కడ డివిజన్ కార్యాలయమే ఏర్పాటు చేయని అంశంపై ఎలా స్పందించాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి. ఏడేళ్లకుపైగా కార్యాలయం ఏర్పాటు చేయకుండా అధికారులు ఏలా విధులు నిర్వహించారో తేల్చాలి. ఈఈపై చర్యలకు ఉపక్రమించిన మంత్రి ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ధిక్కరించి మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో డివిజన్ కార్యాలయం నిర్వహణపై ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారో తేలాలి. తక్షణమే డివిజన్ కార్యాలయాన్ని కుప్పంకు తరలిస్తారా లేదా అన్నది మంత్రి నిర్ణయం, చర్యలపై ఆధారపడి ఉంది.
మదనపల్లెలో ప్రాజెక్టు సర్కిల్–3 కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి కుప్పంకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం రూ.169 కోట్లతో రెండు రీచ్‌లతో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేసుంటే ఇక్కడినుంచి పర్యవేక్షణ పక్కగా జరిగేది. ప్రస్తుతం మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న కుప్పం డివిజన్ కార్యాలయం నుంచి అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో రోజూ కుప్పం కాలువ పనుల పర్యవేక్షణ సాగించాల్సి వస్తోంది. బుధవారం ఈఈ వెంకటేశ్వర్లు కార్యాలయం ఉండి ఇక్కడినుంచే విధులు నిర్వహించారు. ఇంతవరకు కుప్పంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడం, కనీసం అక్కడి నుంచైనా విధులు నిర్వహించకపోవడంతో కుప్పం లైనింగ్ పనుల పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ జీవోను సైతం ధిక్కరించి మదనపల్లె నుంచి విధులు నిర్వహిస్తున్న అధికారుల వ్యవహరం సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి.

అంతా మదనపల్లె నుంచే..

అంతా మదనపల్లె నుంచే..