
కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం): వాల్మీకిపురం పట్టణంలోని శ్రీపట్టాభిరామాలయంలో బుధవారం పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, మూలవర్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణులకు వేద పండితులు స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని మండపంలో సీతారాముల శాంతి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఊంజల్ సేవ చేశారు. రాత్రి హనుమంత వాహనంపై సీతారామలక్ష్మణులను మాడ వీధులలో ఊరేగించారు.భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు క్రిష్ణబట్టార్, భాష్యకాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
● పట్టాభిషేకం మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి గురుడ వాహనంపై శ్రీసీతారాముల విహారం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం