
నేడు బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ
రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో విశిష్టత సంతరించుకున్న బలిజపల్లె గంగమ్మ జాతర నిర్వహణకు ఆదివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా గంగమ్మ స్వయంభు వద్ద గంటకు పైగా పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. వేలాది మంది భక్తులు అంకురార్పణ వేడుకలో పాల్గొననున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఏఎస్పీ మనోజ్ రామ్‌నాఽథ్‌హెగ్డే ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలావుంటే ఏప్రిల్ 3వ తేదీ గంగమ్మ జాతర జరగనుంది.
నేడు అగ్రహారంలో అంకాళమ్మకు పొంగళ్లు
మండలంలోని తుమ్మల అగ్రహారం బలిజపల్లె గంగమ్మకు పుట్టినిల్లు. అందువల్ల బలిజపల్లె గంగమ్మ జాతరకు ఆదివారం అంకురార్పణ చేసే సమయంలో తుమ్మల అగ్రహారంలో వెలిసన అంకాలమ్మకు ఆ గ్రామ ప్రజలు పెద్దఎత్తున పొంగళ్లు పెట్టనున్నారు. దీంతో అంకాలమ్మ సన్నిది వద్ద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బలిజపల్లె గ్రామాన్ని సందర్శించిన ఏఎస్పీ
ఏప్రిల్ 3వ తేదీ జరగనున్న బలిజపల్లె గంగమ్మ జాతరకు ఆదివారం రాత్రి అంకురార్పణ చేపట్టనున్నందున ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే శనివారం బలిజపల్లె గ్రామాన్ని సందర్శించారు. జాతర రోజు గంగమ్మ ప్రతిమను తయారు చేసే ప్రాంతాన్ని, అక్కడ నుంచి గుడిలోకి తీసుకొచ్చే మార్గాన్ని పరిశీలించారు. అంకురార్పణకు ఎంత మంది భక్తులు వస్తారు, వారికి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ అర్బన్ సీఐ రాజను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి జాతరను అందరూ కలిసిమెలసి సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా ఘర్షణలకు దిగి ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.జాతర అంకురార్పణ కార్యక్రమంతో పాటు బుధవారం అర్దరాత్రి ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున వరకు జరిగే జాతర ప్రశాంత వాతావరణంలో ముగియడానికి నిర్వాహకులు, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ రాజ, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు బలిజపల్లె గంగమ్మ జాతరకు అంకురార్పణ