ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు | Sakshi
Sakshi News home page

ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు

Published Wed, Feb 14 2024 8:58 AM

- - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసే ప్రతిష్టాత్మక మెగా క్రీడా టోర్నమెంట్‌ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో భాగంగా.. నిర్వహించిన టాలెంట్‌ హంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు అవకాశం లభించింది. జిల్లాకు చెందిన కె.రామ్మోహన్‌, ఇ.హేమావతిలతోపాటు పులివెందుల జేఎన్‌టీయూలో నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 14 మంది టాలెంట్‌ ప్లేయర్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కడప స్పోర్ట్స్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు దాదాపు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో పూర్తి చేసుకోగా.. మంగళవారం విశాఖపట్నంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రతిభ కనబరిచిన వివిధ క్రీడాకారులను పరిశీలిస్తూ వచ్చిన శాప్‌ అధికారులు, అసోసియేషన్‌ ప్రతినిధులు, టాలెంట్‌ హంట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి వివిధ అసోసియేషన్‌లు, సంస్థలు దత్తత తీసుకోగా.. వీరికి ప్రభుత్వం సహకారం అందించి ఉత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఖోఖో క్రీడాంశంలో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. అయితే వీరిరువురూ విద్యాభ్యాసం, శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలలో చదువుతుండగా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆయా జిల్లాల నుంచి ప్రాతనిథ్యం వహించి సత్తా చాటారు.

ఆల్‌రౌండర్‌గా హేమావతి..

చింతకొమ్మదిన్నె మండలం కొత్తపల్లెకు చెందిన సాధారణ రైతు శివశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె అయిన ఇల్లూరు హేమావతి పదో తరగతి వరకు బయనపల్లె ఎస్‌.వి.హైస్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎన్‌ఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. కనిగిరిలో ఫిజికల్‌ డైరెక్టర్‌ కాశీవిశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. రన్నర్‌గా, ఛేజింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈమె జట్టు విజయంలో కీలకభూమిక పోషించి బెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచింది.

రామ్మోహన్‌.. ఛేజింగ్‌లో ఫస్ట్‌

చింతకొమ్మదిన్నె మండలం ఆర్‌.టి.పల్లె గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మ దంపతులు కుమారుడైన కట్లా రామ్మోహన్‌ పదో తరగతి వరకు బయనపల్లె ఎస్‌.వి.హైస్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇనకొల్లులోని డీసీఆర్‌ఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని, జె.పంగలూరు గ్రామంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈయన ఛేజింగ్‌, రన్నింగ్‌లలో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో పలు సీనియర్‌ నేషనల్స్‌తోపాటు, ఖోఖో ప్రోలీగ్‌ పోటీల్లో చైన్నె క్విక్‌గన్‌, గుజరాత్‌ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జె.పంగలూరు సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించి బాపట్ల జట్టును స్టేట్‌ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించి ఖోఖో పురుషుల విభాగంలో బెస్ట్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

కె.గాయత్రి.. బ్యాటింగ్‌లో మేటి

పులివెందుల పట్టణంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ట్రిపుల్‌ఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి మహిళల క్రికెట్‌లో చక్కటి ప్రతిభ కనబరిచి టాలెంట్‌ హంట్‌లో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేష న్‌ ప్రతినిధుల చూపును ఆకర్షించింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల సచివాలయం జట్టు నుంచి పాల్గొ న్న కడప మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గాయత్రి బ్యాటింగ్‌లో చక్కటి ప్రతిభ కనబరచడంతో టాలెంట్‌ హంట్‌కు ఎంపికై ంది. కాగా ఈమె స్వస్థలం పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌గా తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఈశ్వరరావు విశాఖపట్నంలో స్థిరపడ్డారు.

సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు

ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు, క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు.

● బ్యాడ్మింటన్‌ పురుషుల విభాగంలో కడప కాగితాలపేట సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్‌–ఖాజా జోడి రెండో రన్నరప్‌గా నిలిచాయి.

● బ్యాడ్మింటన్‌ మహిళల విభాగంలో కడప శంకరాపురం–4 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన కె.వెన్నెల–శ్రీలత జోడి రన్నరప్‌గా నిలిచారు.

● వాలీబాల్‌ పురుషుల విభాగంలో అన్నమయ్య జిల్లా కూచివారిపల్లె–1 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్‌ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి.

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement