పరీక్షా కేంద్రాల పరిశీలన
జిల్లాలో మొత్తం పదవ తరగతి
విద్యార్థులు: 21,526
బాలురు: 10,598
బాలికలు: 10,928
కంపార్ట్‌మెంటల్: 623
జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 124
ఓపెన్ స్కూలు విద్యార్థులు: 648
పరీక్షలకు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు: 30
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు: 09
పరీక్షల నిర్వహణకు ఉపయోగించే
ఇన్విజిలేటర్లు, సిబ్బంది: 2602
పరీక్షల సమయం: ఉశ్రీశ్రీ 9.30 నుంచి 12.45 గంటల వరకు
సాక్షి అన్నమయ్య: పదవ తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలు, ఇతర ఇంటర్నెట్ సెంటర్లను కూడా మూసివేసేలా ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరులలో ఓపెన్ స్కూలు విద్యార్థులను కలుపుకుని కంపార్టుమెంటల్, రెగ్యులర్ విద్యార్థుల పరంగా 22,149 మంది విద్యార్థులు ఉన్నారు. 124 పరీక్షా కేంద్రాల్లో సోమవారం జరిగే తొలి పరీక్షకు విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగియనుంది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ‘సాక్షి’ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.
పరీక్షల నిర్వహణకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు
జిల్లాలోని 124 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరగనుండగా మాస్ కాపీయింగ్‌తోపాటు ఇతర అక్రమాలను నిరోధించేందుకు జిల్లా విద్యాశాఖ స్క్వాడ్ బృందాలను నియమించింది. ఇందులో భాగంగా తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు 30 సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి విద్యాశాఖ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో సుమారు 2 వేల మందికి పైగా సిబ్బందిని వివిధ విభాగాలకు సంబంధించి నియమించారు. ఆదివారం మదనపల్లె పరిఽధిలో రాష్ట్ర పరిశీలకులు నారాయణరావుతోపాటు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం పలు కేంద్రాలను పరిశీలించారు.
పటిష్ట బందోబస్తు
పరీక్షల నేపధ్యంలో కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ కేంద్రాల వద్ద ప్రజలు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రం వద్ద భద్రతా చర్యల్లో పోలీసు సిబ్బందిని నియమించారు.
మదనపల్లె సిటీ: పదో తరగతి పరీక్షా కేంద్రాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక పరిశీలకులు నారాయణరావు మదనపల్లెలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆదివారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను చూశారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ సుబ్రమణ్యం, డివైఈఓ లోకేశ్వరరెడ్డి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఎఈఓలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్ ఉన్నారు.
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు... 144 సెక్షన్
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు ఉదయం నిర్ణీత సమయానికి కేంద్రానికి చేరుకోవాలి. పుస్తకాలు, ఇతర ఎలాంటి వస్తు సామగ్రి సమీప ప్రాంతాలకు తీసుకురాకూడదు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్ర పరిశీలకులు నారాయణరావు ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. –డీఈఓ సుబ్రమణ్యం
మదనపల్లెటౌన్: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్ అధికారులతో కలసి సమీక్ష నిర్వహించి బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా 124 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. వాటిలో 88 పరీక్షా కేంద్రాల వద్ద గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తారన్నారు. విద్యార్థినుల కోసం, మహిళా పోలీసులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనధికారిక వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధం అన్నారు. పరీక్షా కేంద్రాలకు పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు, మూసివేయాలని ఆదేశించారు.


