
శాసనమండలి వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
మండలిలో కొనసాగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో నిరసన
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు.. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషేన్‌రాజు
చర్చకు పట్టుపట్టి పోడియం ఎక్కి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
లఘు చర్చకు బీఏసీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా?
ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స
బీఏసీ నిర్ణయం తీసుకున్నా చర్చ ఎప్పుడనేది ప్రభుత్వ ఇష్టం: మంత్రి అచ్చెన్న
చేతుల్లో ప్లకార్డులు... మెడలో నల్ల కండువాలు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు...!పేదలు, మధ్య తరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారా? అంటూ ప్రశ్నిస్తూ...! చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కదంతొక్కారు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు కట్టబెడతారా? సిగ్గుసిగ్గు అంటూ నిప్పులు చెరిగారు..!
చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు దోపిడీకర్త... సీఎంవా? దళారీవా? అంటూ ధ్వజమెత్తారు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు సోమవారం తొలుత నిరసన తెలిపిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు తర్వాత శాసనమండలిలో గట్టిగా గళమెత్తారు.! ప్రజారోగ్యం ప్రైవేట్ పరమా? ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ మండలిని హోరెత్తించారు...!
సాక్షి, అమరావతి: సిగ్గు సిగ్గు... ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రయివేట్‌పరమా? ప్రజారోగ్యం ప్రైవేట్‌కా..? ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం... దోపిడి రాజ్యం అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిని హోరెత్తించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం రద్దు చేయాలంటూ సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన కొనసాగించారు. నల్ల కండువాలు ధరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వచ్చిన వారు నిరసనకు దిగారు.
ఈ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, సిపాయి సుబ్రహ్మణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ తొలుత పోడియం ముందు, తర్వాత పోడియం ఎక్కి నినాదాలు చేశారు. పదేపదే ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం సరికాదని, చర్చకు తాము సిద్ధమని, సంబంధిత మంత్రులు అందుబాటులో లేనందున, మరోసారి చర్చిద్దామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ అన్నారు.
దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లఘు చర్చకు బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయం రద్దు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని బీఏసీలో నిర్ణయం తీసుకున్నాక.. అది ఎప్పుడు చర్చకు పెట్టాలనేది ప్రభుత్వ ఇష్టమని అన్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన నడుమ చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
ప్రైవేటీకరణ రద్దుకు వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళనలు, టీడీపీ సభ్యుల వాగ్వాదంతో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చాక సభను వాయిదా వేశారు. కొద్దిసేపు విరామం ప్రకటించిన చైర్మన్ మోషేన్‌రాజు తన చాంబర్‌లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యులతో చర్చించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సోమవారం చర్చించేలా బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. సభ ముగిసేలోపు చర్చిస్తామని మంత్రులు బదులిచ్చారు. దీంతో చైర్మన్ మోషేన్‌రాజు బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ అంశంపై బుధవారం చర్చించేలా వైఎస్సార్‌సీపీ, టీడీపీతో చర్చించి బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేటీకరణను వెంటనే విరమించండి
ప్లకార్డులతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే విరమించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు... సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని పూర్వపు కియా షోరూం సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది.
మండలిలో చర్చ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని బొత్స విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముద్దు, ప్రైవేటీకరణ వద్దు... అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్సీలంతా ప్లకార్డులతో అసెంబ్లీ ప్రధాన గేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ‘‘జీవో 590ను వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం. సామాన్యుడుకి ఉన్నత చదువు దూరం.. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా? దళారీవా? ముడుపుల కోసం ప్రజల ఆస్తులు అమ్మేస్తారా? సిగ్గు సిగ్గు.. సంపద సృష్టికర్త కాదు దోపిడీకర్త’’ అంటూ మండిపడ్డారు.