ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం.. 25న భీమిలిలో బహిరంగ సభ

Published Thu, Jan 18 2024 2:21 PM

YSRCP Election Campaign From Uttarandhra CM Jagan Meeting Bheemili - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ఫోకస్‌ పెట్టింది పార్టీ. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో గురువారం కీలక సమావేశం నిర్శహించారు.

తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి నియోజవర్గం నుంచి ఆయుదు ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. 

సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్రాన్ని అయిదు జోన్‌లుగా విభజించి కేడర్‌ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని చెప్పారు. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారని తెలిపారు.

ఇది ఒకరకంగా ఎన్నికల శంఖారావం అనుకోవచ్చన్నారు. ఎన్నికలకు పార్టీని గేరప్‌ చేసే దిశగా మీటింగులు జరగనున్నాయని బొత్స పేర్కొన్నారు. ‘ఎవరికి ఎమ్మెల్యే..ఎవరికి ఎంపి టికెట్ ఇవ్వాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఈ పార్టీ  వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. టికెట్‌లు ఇవ్వలేదన్న భావం మా నేతల్లో లేదు. కేశినేని నాని ఎందుకు పార్టీ నుంచి వెళ్లి పోయారు. అసలైన ఓటర్లు వుండేలా చూసే భాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఏపీతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మాకు ముఖ్యం.

విశాఖలో  ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే. రుషికొండలో ఐటీ సెజ్...అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీలు వైఎస్సార్ హయాంలో వచ్చినవే. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర విశాఖలో ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా చెప్పండి. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు  కాంట్రాక్ట్ పనులు రద్దు చేయించారు.

‘సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యర్థనపై ఇచ్చాం. పురందేశ్వరి మాట్లాడే ముందు ఆలోచించు. 22వ తేదీన సెలవు కావాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టొచ్చు. ప్రభుత్వం పరిశీలిస్తుంది. విశాఖలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలే. ఆ ప్రాజెక్టుల గురించి ఆ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’  అని అన్నారు.

చదవండి: గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్‌

 
Advertisement
 
Advertisement