‘సర్‌’లో టీడీపీ అక్రమాలపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Alleges Irregularities In SIR Process, Complains To Andhra Pradesh CEO Over My TDP App, More Details Inside | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో టీడీపీ అక్రమాలపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Jun 16 2026 2:21 AM | Updated on Jun 16 2026 1:20 PM

YSRCP complains to SEC about TDP irregularities in Sir

సచివాలయం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు

మై టీడీపీ యాప్‌ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.

అనంతరం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడకుండా వారిని అడ్డుకున్న పోలీసులు

రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సచివాలయం ఐదో బ్లాక్‌ ఎదుట 

బైఠాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, నేతలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో టీడీపీ సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని  సోమవారం సచివాలయంలో కలిశారు. ‘సర్‌’ ప్రక్రియ సందర్భంగా ‘మై టీడీపీ యాప్‌’ ద్వారా ఓటర్ల కులం, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను అధికార టీడీపీ సేకరించడంపై ఫిర్యాదు చేశారు.

అనంతరం వారంతా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉన్న సచివాలయం ఐదో బ్లాక్‌ వద్ద మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగా, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎదురుగా మరో బ్లాక్‌ ఎదుట మాట్లాడేందుకు వెళ్తుండగా అడ్డుకోవడం, సచివాలయ ఆవరణలో మాట్లాడకుండా నిరోధించటాన్ని వైఎస్సార్‌ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపించారు. సచివాలయం బయట మాట్లాడాలని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత ప్రతిపక్షంగా తాము ఏం చెప్పామో  వివరాలు వెల్లడించకూడదా? అంటూ నిలదీశారు. తాము ఎమ్మెల్సీలమని, సచివాలయంలో ఎమ్మెల్సీలను మీడియాతో మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సచివాలయం ఐదో బ్లాక్‌ ముందు మెట్లపై బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. మైక్‌లు లేకుండానే వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.  

‘సర్‌’ తొలిరోజే డేటా చోరీ..
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా  
⇒  ‘మై టీడీపీ’ యాప్‌ ద్వారా వ్యక్తిగత వివరాల సేకరణ 
⇒  సీఈవోను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేశాం

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్‌ ద్వారా ఓటర్ల డేటా చోరీకి తెర తీసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. సహచర ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తితో కలిసి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌యాదవ్‌ని కలిసి సర్‌ ప్రక్రియ సందర్భంగా టీడీపీ చేస్తున్న అక్రమాలు, ఓటర్ల డేటా గోప్యతలో లోపాలపై ఫిర్యాదు చేశారు.

అనంతరం అప్పిరెడ్డి మీడియాతో  మాట్లాడారు. ‘గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని యాప్‌ ద్వారా సేకరిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ‘మై టీడీపీ’ యాప్‌ ద్వారా ఒక్కో ఓటరును మీరు ఏ రాజకీయ పార్టీ? ఏ కులం? అని అడుగుతూ ఓటర్ల వివరాలను యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై గోప్యత పాటించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఎక్కడా అది కనిపించడం లేదు. గోప్యంగా ఉండాల్సిన సమాచారం సేకరించి ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు ప్రయతి్నస్తున్నారు.

ఎన్నికల కమిషన్, అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన జాబితాలు టీడీపీకి చెందిన బీఎల్‌ఏల  చేతుల్లో కనిపిస్తున్నాయి. మాకు కూడా అలాంటి జాబితాలు ఇవ్వాలని అడిగాం. యాప్‌ లను అనుమతించే అవకాశం ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా యాప్‌లను వినియోగించుకుంటుందని చెప్పాం. మ్యాపింగ్‌ కాని ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోవాలి.

కానీ చాలాచోట్ల బీఎల్వోలు మాత్రం ఓటర్ల లిస్ట్‌ ప్రచురణ అయిన తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. అది సరికాదు. ఇప్పుడే డాక్యుమెంట్స్‌ ఇస్తే తీసుకోవాలి. అక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఇవ్వాలని కోరాం. బీఎల్వోకు రాజకీయ పార్టీలు ఐడీ కార్డులు ఇస్తే వాటిని ఈసీ అధికారులు ధృవీకరించాలని కోరాం. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లను నమోదు చేశారు? ఎన్ని ఓట్లు మ్యాప్‌ చేశారు? ఎన్ని కాలేదు? అనే వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఈవోను కోరాం. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు’ అని అప్పిరెడ్డి తెలిపారు. 

ఎమ్మెల్సీలకు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదా..? 
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తరహాలో కూటమి ప్రభుత్వం ప్రజల గొంతులను  నొక్కేందుకు యత్నిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నేతలు దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వం ఏ దిశగా పాలన చేయాలని ఆలోచిస్తోందో అర్థం కావడం లేదు. ఎమ్మెల్సీలుగా మాకు గొంతెత్తి మాట్లాడేందుకు మాకు అవకాశం లేదా? నియంత రాజ్యంలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. అధికారులను అడ్డుపెట్టుకుని మా గొంతు నొక్కాలని చూస్తోంది. ఎవరినీ అభిప్రాయాలు, సమస్యలు చెప్పుకోనివ్వడం లేదు. అంతా రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే. ఎన్ని నిర్భంధాలు పెట్టినా మేం ప్రజల గొంతుకగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం’ అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement